భారం...దూరమయ్యేనా?

24 May, 2014 02:32 IST|Sakshi

పాలమూరు, న్యూస్‌లైన: మూడేళ్లుగా విద్యుత్ చార్జీల బాదుడుకు జిల్లా జనం అల్లాడిపోయారు. ఇబ్బడిముబ్బడిగా చార్జీల పెంపు, సర్దుబాటు చార్జీల పేరిట వసూలు చేస్తూ.. వినియోగంకంటే రెండింతలు బిల్లులు వసూలు చేస్తుండటంతో సామాన్యులు అవస్థలు పడ్డారు. ఆ కష్టాలను తలచుకుంటూనే తెలంగాణ రాష్ట్ర కొత్త సర్కారుపై జనం గంపెడాశలు పెట్టుకున్నారు. అదనపు విద్యుత్ భారం కొత్తప్రభుత్వమైనా.. తగ్గిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అమలుపర్చారు. అన్ని రంగాలకూ ప్రయోజనం కల్పించాలన్న సంకల్పంతో విద్యుత్ రాయితీని అధికమొత్తంలో ప్రభుత్వమే భరించింది. ఆయన మరణానంతరం ఈ ఆశయం నీరుగారిపోయింది. గడిచిన మూడేళ్లలో పెరిగిన విద్యుత్, సర్దుబాటు చార్జీల పేర జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై రూ.300 కోట్లకు పైగా భారం మోపారు. కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రెండేళ్లలోనే రూ.80 కోట్లు వసూలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపితే విద్యుత్తు చార్జీల భారం ప్రజలకు కొంతమేరకైనా తగ్గుతుందని భావిస్తున్నారు.
 
 బాదుడు ఇలా..
 గత ప్రభుత్వం పెంచిన విద్యుత్‌చార్జీలతో పాటు సర్దుబాటు చార్జీలను కూడా సామాన్యులపై మోపి కోలుకోలేని స్థితికి చేర్చింది. ప్రజలపై అధికభారం మోపిన రాష్ట్ర సర్కారు.. విద్యుత్ శాఖ ద్వారా మరో షాక్ తగిలించింది. జిల్లాలోని గృహ, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగదారులపై ఈ ఏడాదిలో రూ.40 మోపారు.
 
  జిల్లావ్యాప్తంగా 6.65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ కనెక్షన్‌లు 4.25 లక్షలు, 1.90 లక్షల వ్యవసాయ కనెక్షన్‌లు, 55వేల వరకు వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు, ఇతరత్రా కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ సర్దుబాటు చార్జీలపేర జనంపై ఎక్కడలేని భారం మోపడంతో ప్రభుత్వ విధానాలపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యుత్ వాడకంతో లబ్ధిపొందే చిరువ్యాపారులు రెండింతలుగా వచ్చిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక, తమ వ్యాపారాలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయకపోగా, ఎడాపెడా చార్జీల భారం మోపడంపై మండిపడుతున్నారు. సర్‌చార్జీ వసూలు అద్దె ఇళ్లల్లో సమస్యలకు దారి తీస్తోంది. ఎవరో వాడుకున్న విద్యుత్‌కు మేం ఇంధన చార్జీలు చెల్లించడమేమిటని పలువురు గొడవలు పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి కొత్త ప్రభుత్వం తమను బయటపడేయాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు