ఇసుకాసురులపై కన్నెర్ర

25 Jun, 2015 01:14 IST|Sakshi

తాండూరు రూరల్ : ఇసుక అక్రమ రవాణాపై సబ్ కలెక్టర్ అలగు వర్షిణి మరోసారి కన్నెర్ర జేశారు. బుధవారం ఉదయాన్నే ఆమె తాండూరుకు చేరుకొని స్థానిక రెవెన్యూ సిబ్బందితో రెండు బృందాలుగా విడిపోయి పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పట్టణ శివారు ప్రాంతాల్లో నిల్వచేసిన దాదాపు 150 ట్రాక్టర్ల ఇసుక డంపింగ్‌లను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనులకు ఉపయోగించే విధంగా చర్యలు చేపడతామన్నారు. తాండూరులో రోజు రోజుకు ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని.. త్వరలో వారిపై చర్యలు తీసుకొని.. వారి పేర్లను వెల్లడిస్తామని చెప్పారు. వివరాల్లోకి వెళితే.. ఉదయమే సబ్ కలెక్టర్ అలగు వర్షిణి తాండూరుకు బైక్‌పై వచ్చారు.
 
 పట్టణంలోని నేషనల్ గార్డెన్ వెనకాల అక్రమంగా నిల్వ చేసిన 120 ట్రాక్టర్ల ఇసుకను సీజ్  చేశారు. మల్లప్ప మడిగ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఖాంజాపూర్ వాగు నుంచి మల్కాపూర్ గ్రామానికి వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పర్మిట్ చూపించడంతో వదిలే శారు. అక్కడి నుంచి కొడంగల్ రోడ్డులోని ప్రతిభ పాఠశాల సమీపంలో ఇసుక డంపింగ్ నిల్వ చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వర రైస్‌మిల్ వెనక భాగంలో ఉన్న 20, గ్రీన్‌సిటీ సమీపంలో 10 ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వర్షిణి మట్లాడుతూ  ఇసుక డంపింగ్ నిల్వలపై ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు.
 
 ప్రభుత్వ పనులకు ఇసుక పర్మిషన్ ఉందని.. కానీ అక్రమంగా మాత్రం ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు ఎంపీడీఓకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వేబిల్లులు వాగు సమీపంలో ఉండి పంపిణీ చేయాలన్నారు. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి పట్టుకున్న ట్రాక్టర్‌కు వాల్టా చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా విధించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
 
 ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో డ్రైవర్లు ఎవరెవరితో మాట్లాడారనే విషయం బయటకు తీశామన్నారు. ముఖ్యంగా ఇసుక మాఫియాగా చెబుతున్న నలుగురి వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయన్నారు. త్వరలో వారి వివరాలు వెల్లడించి, చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమంగా తరిలిస్తూ మొదటిసారి పట్టుకున్న నోటీసులు ఇస్తామని.. రెండో సారి పట్టుబడితే మాత్రం వాల్టా చట్టం ప్రకారం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు.
 
 త్వరలో జేసీ ఆమ్రపాలి పర్యటన..
 తాండూరులో ఇసుక అక్రమ రవాణాపై జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి సీరియస్‌గా ఉందని.. రెండు రోజుల్లో ఆమె తాండూరులో పర్యటించనున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను వేస్తామని చెప్పారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారని చెప్పారు. స్థానిక పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునడంలో విఫలమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు