ఇబ్బందుల్లేకుండా జీఎస్టీ అమలు

18 Apr, 2018 02:55 IST|Sakshi

     ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 

     జీఎస్టీ ఇబ్బందుల పరిష్కారానికి ఏర్పాటైన ఉపసంఘం సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఏర్పాటైన వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఉప సంఘ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశానికి దేశంలో ఉన్న ట్యాక్స్‌ కన్సల్టెంట్లను, ఫిక్కీ, సీఐఐ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు.

వారిచ్చిన సలహాలను వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముందుంచి.. ఆమోదించి జీఎస్టీ అమలును సరళతరం చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు, ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పన్ను ఎగవేతదారులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చేయూత ఇవ్వాలే తప్పా.. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్‌డీపీలో 25 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం రుణం పొందే అవకాశాన్ని 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలకు తాము వ్యతిరేకమని చెప్పారు.   

క్షేత్రస్థాయిలో నగదు కొరత.. 
రాష్ట్రంలో నగదు కొరతపై ఈటల స్పందిస్తూ.. తెలంగాణకు గతంలో కంటే ఎక్కువ డబ్బు సరఫరా చేసినట్టు కేంద్రం లెక్కలు చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో కొరత ఉందన్నారు. ‘దేశంలో ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా బ్యాంకు మోసాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం సరికాదన్న ఆలోచనా ధోరణిలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయానికి నిధుల కొరత ఉండదని ఆశిస్తున్నాం. ఈ పథకం అమలు చేస్తున్నాం కాబట్టి రూ.6 వేల కోట్ల నగదు సరఫరా చేయాలని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరాం. ఆయన సానుకూలంగా       స్పందించారు’అని అన్నారు.  

మరిన్ని వార్తలు