నగదు బదిలీ.. నేటి నుంచే..

15 Nov, 2014 03:21 IST|Sakshi

ఆదిలాబాద్ అర్బన్ : రాయితీ వంటగ్యాస్ అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నగదు బదిలీ పథకం శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. దేశంలోని 54 జిల్లాలో ప్రారంభిస్తుండగా.. రాష్ట్రం లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలో మొదలు కానుంది. గత యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసినా.. ఎన్నికల ముందు బ్రేక్ పడింది.

కొన్ని మార్పులుచేర్పుల తదుపరి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తోంది. అప్పటి కలెక్టర్ అహ్మద్ కృషి ఫలితంగా జిలాల్లో నగదు బదిలీ ప్రారంభం కాగా, ఈ పథకం కింద ఆధార్ అనుసంధానంలో దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐదు నెలలుగా ఈ పథకం అమలులో ఉన్నప్పుడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రాయితీ సొమ్ము జమకాకపోవడం.. పేద, మధ్య తరగతి కుటుంబీకులు మొత్తం ధర చెల్లించి సిలిండర్ తీసుకోలేకపోవడం.. తదితర కారణాలతో పథకం నిలిచిపోయింది. ఫలితంగా అప్పటి ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్నికలకు ముందు నగదు బదిలీని నిలిపివేసింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా అనుసంధానంతో అమలు చేసిన ఈ పథకంలో కొన్ని మార్పుల అనంతరం బ్యాంకు ఖాతాతోనే ఇప్పుడు పథకం ప్రారంభం కావడం విశేషం.  

 జిల్లాలో 3,28,169 మందికి వర్తింపు..
 జిల్లాలో 3,74,904 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 3,28,169 మంది లబ్ధిదారుల గ్యాస్ కనెక్షన్లు ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. ఇంకా 46,735 మంది తమ బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. వీటిలో 45,303 మందికి ఆధార్‌తో అనుసంధానం అయినా బ్యాంకు ఖాతా లేదు. అందుకే.. ప్రభుత్వం ఈ పథకంలో చేరేందుకు మూడు నెలలు (గ్రేస్ పీరియడ్) గడువు విధించింది. ఈ మూడు నెల (ఫిబ్రవరి 14)ల్లోగా గ్యాస్‌కు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మొత్తం ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అదికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకంలో చేరిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా అనుసంధానం చేస్తే రాయితీ సొమ్ము నేరుగా సదరు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆధార్ నంబర్ లేకున్నా సరిపోతుంది.

 92,038 మందికి ఖాతాలు లేవు..
 ఆధార్, బ్యాంకు ఖాతాతో అనుసంధానం కాని వారు 46,735 మంది ఉండగా.. బ్యాంకు ఖాతాతో చేయని వారు 45,303 మంది ఉన్నారు. దీంతో మొత్తంగా 92,038 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. ఒకే పేరుపై రెండేసి కనెక్షన్లు ఉండడం, కొందరికి ఆధార్, బ్యాంకు ఖాతాలు లేకపోవడం, కొన్ని కనెక్షన్లు హోటల్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వినియోగించడం వంటి తదితర కారణాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 89 శాతం గ్యాస్ కనెక్షన్లకు ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానమైంది. బ్యాంకు ఖాతాలు లేని 92,038 మంది లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలిస్తున్నామని సంబంధింత అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పథకం అమలు ఎంతమేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు