15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ

9 Nov, 2014 02:13 IST|Sakshi

 సిలిండర్‌కు రూ. 996 చెల్లిస్తే.. బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది రూ. 552
 
 సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కొద్దిపాటి మార్పులు, చేర్పులతో తిరిగి ప్రారంభమవుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తొలిదశలో ఈ నెల 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 54 జిల్లాల్లో నగదు బదిలీ అమల్లోకి రానుంది. ఇందులో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా వేగంగా జరుగుతోంది. జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వంటగ్యాస్‌కు నగదు బదిలీ ప్రారంభం కానుంది. ఇది అమల్లోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ పూర్తి ధరను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుం ది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన  సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే సిలిండర్ పూర్తి ధరను ఒకేసారి చెల్లించాలంటే.. పేదలకు అది తలకు మించిన భారమనే విమర్శలు వస్తున్నాయి.
 
 సబ్సిడీ వంట గ్యాస్‌కు నగదు బదిలీ అంశాన్ని గతంలోనే యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చినా... దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దానిని ఉపసంహరించుకుంది. కానీ ఇటీవల ఈ అంశంపై సమీక్షించిన ఎన్డీయే ప్రభుత్వం.. కొద్దిపాటి మార్పు, చేర్పులతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. నవంబర్ 10వ తేదీ నుంచే నగదు బదిలీని ప్రారంభించాలని భావించినా... పలు కారణాలతో ఇదే నెల 15వ తేదీకి వాయిదా పడింది. తొలిదశలో భాగంగా ఈ నగదు బదిలీని రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తంగా దాదాపు కోటి మంది ఎల్పీజీ వినియోగదారులు ఉండగా అందులో సుమారు 35 లక్షలు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
 
 రూ. 996 చెల్లించాలి..
 
 గృహ వినియోగదారులు ఇకపై వంటగ్యాస్‌ను తీసుకోవాలంటే ముందుగా నిర్ణీత ధర రూ. 996.50 (14.2 కేజీల సిలిండర్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఇందులో వినియోగదారులు చెల్లించాల్సిన రూ. 444 మినహాయించి, సబ్సిడీ మొత్తమైన రూ. 552.50ను తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. అయితే గతంలో విధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా కేవలం బ్యాంకు ఖాతా ఉంటే చాలు వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా రెండూ లేనివారు ఉంటే వారికి మూడు నెలల పాటు ఖాతా తెరిచేందుకు అదనపు సమయం ఇస్తారు. అప్పటివరకు ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతిలోనే వారు వంట గ్యాస్‌ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం నగదు బదిలీ అమలుకానున్న మూడు జిల్లాల్లో సుమారు 24 శాతం మందికి బ్యాంకు ఖాతాలు వంటగ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం కాలేదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఏడాదిలో ఎప్పుడైనా 12 సిలిండర్‌లను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. మరోవైపు నగదు బదిలీ కారణంగా.. పేద వినియోగదారులు ఒకేసారి పూర్తి సిలిండర్ ధరను చెల్లించాల్సి రావడం ఇబ్బంది మారుతుందనే విమర్శలు వస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు