‘నిఘా’.. పక్కా.. 

28 Oct, 2018 07:32 IST|Sakshi
నేలకొండపల్లిలోని బీసీ వసతి గృహం (ఇన్‌సెట్‌) ఖమ్మం ఎస్సీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 

సాక్షి, నేలకొండపల్లి: విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు.. పిల్లల కదలికలను నిరంతరం తెలుసుకునేందుకు.. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని హాస్టల్‌లో జరిగిన బాలుడి హత్య ఉదంతంతో రాష్ట్ర యంత్రాంగం కదిలింది. సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని వసతి గృహాల్లో ఏర్పాటు చేయగా.. మిగిలిన వాటిలోఅమర్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో మొత్తం 77 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. అందులో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 కాగా.. 27 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వాటన్నింట్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీసీ కెమెరాల ద్వారా విద్యార్థుల రోజువారీ దైనందిన పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న పద్ధతులు, అధికారులను మానిటరింగ్‌ చేసే అవకాశం ఉండడంతో వార్డెన్లపై మరింత బాధ్యత పెరగనుంది.

హాస్టల్‌కు ఆరు చొప్పున..  
జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 50 ఉండగా.. ఇప్పటికే 28 వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా బీసీ వసతి గృహాలు మెట్రిక్‌ 20, పోస్టు మెట్రిక్‌ 7 ఉండగా.. వాటిల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వసతి గృహానికి 6 చొప్పున అమరుస్తున్నారు. విద్యార్థులతోపాటు వార్డెన్లు, అధికారుల పనితీరును రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అల్పాహారం, ట్యూషన్, రాత్రి భోజనం, చదువు, నడవడిక, ఆట, పాటలు, విద్యార్థుల మధ్య మనస్పర్థలను సీసీల ద్వారా ఉన్నతాధికారులు నేరుగా మానిటరింగ్‌ చేయనున్నారు. అలాగే వార్డెన్లు సకాలంలో హాజరువుతున్నారా.. లేదా.. విద్యార్థులతో ఎలా ఉంటున్నారు. వసతి గృహాల్లో ఉన్నారా.. లేదా.. అనే అంశాలను పరిశీలించనున్నారు. దీనికితోడు హాస్టళ్లలో జిల్లా అధికారులు తనిఖీలు చేస్తున్నారా.. లేదా.. అనే విషయాలను ఉన్నతాధికారులు నేరుగా సీసీ కెమెరాల ద్వారా తెలుసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు