బీసీ హాస్టళ్లలో నిఘా నేత్రం

24 Mar, 2019 14:47 IST|Sakshi
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న సెట్విన్‌ కంపెనీ ప్రతినిధులు

కమిషనరేట్‌తో అనుసంధానం  –  సీసీ కెమెరాలతో పారదర్శకత 

సత్తుపల్లిటౌన్‌: ప్రభుత్వం హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు   మెనూ సక్రమంగా అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలోని 24 బీసీ హాస్టళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 26 హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 18 హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. మిగతా బీసీ హాస్టళ్లలో వారం రోజుల్లో  అమర్చేందుకు చర్యలు చేపట్టింది.  

ఒక్కో హాస్టల్‌లో ఆరు సీసీ కెమెరాలు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ హాస్టళ్లు ఇక సీసీ నిఘాతో పని చేయనున్నాయి.  బీసీ హాస్టల్‌లోని విద్యార్థులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసింది. ఒక్కో హాస్టల్‌లో ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, మరుగుదొడ్లు, కిచెన్, ఆఫీస్‌రూం, డైనింగ్‌ హాల్‌ ఆరు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బీసీ హాస్టల్‌లో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు..? సంక్షేమ అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారానే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది.

జిల్లా బీసీ డెవలప్‌మెంట్‌ అధికారి కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్‌ కమిషనర్‌ కార్యాలయంతో సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌ అనుసంధానం చేశారు. సెట్విన్‌ కంపెనీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్‌లో సీసీ కెమెరాలు చేపడుతున్నారు.  

అక్రమాలకు చెక్‌  

హాస్టళ్లలో సంక్షేమ అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరును ఇకపై ఉన్నతాధికారులు నిఘా నేత్రాల సహకారంతో ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా హాస్టల్‌లోకి ఇతర వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా..? హాస్టల్‌ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్నారా?, స్టోర్‌ రూంలో సరుకుల నిల్వలు, కిచెన్‌లో వంట పనుల తీరు, ఇలా సమగ్రంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. దీనివల్ల హాస్టళ్లలో అక్రమాలకు చెక్‌ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.    
    

మరిన్ని వార్తలు