సిమెంట్ ధరలకు రెక్కలు

8 Jun, 2014 00:50 IST|Sakshi
సిమెంట్ ధరలకు రెక్కలు

 సిమెంట్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం కాబట్టి సహజంగా ఈ సీజన్‌లో సిమెంట్ ధరలు స్థిరంగా ఉండవచ్చని గృహనిర్మాణదారులు భావించారు. మార్కెట్ వర్గాలు సైతం ఊహించని విధంగా సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యుడు రెండు గదుల ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వారం రోజుల్లో 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగాయి. వారం రోజుల క్రితం రూ.200  నుంచి రూ.210కి విక్రయించిన సిమెం ట్ బస్తా ధర ప్రస్తుతం రూ.280కి చేరింది. పెరిగిన ధరల కారణంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారితోపాటు ఏజెన్సీల వారు కూడా ఆందోళన చెందుతున్నారు.
 
  జిల్లాలో 23 సిమెంట్ పరిశ్రమలు ఉన్నప్పటికీ ధరలు విపరీతంగా పెరగడానికి ఉత్పత్తి తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంకంటే 50 శాతం సిమెంట్ ఉత్పత్తి మాత్రమే చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల కాలంలో వివిధ సిమెంట్ కంపెనీ యజమానులు సిండికేట్ అయ్యి ధరలు అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. హర్‌ఏక్‌మాల్ సరుకులు మాదిరిగా మార్కెట్లో ఏ కంపెనీ సిమెంట్ అయినా ఐదు, పది రూపాయలు మాత్రమే తేడా ఉంది. సిమెంట్ ధర తక్కువగా ఉందని నిర్మాణాలు మొదలు పెట్టిన వారు నిర్మాణ ఖర్చు మరింత భారమవుతుందేమోనని ఆందోళన చెందుతుండగా మరి కొందరు నిర్మాణాలు మొదలు పెటేందుకు జంకుతున్నారు. ఇంటి నిర్మాణాలు నిలిచితే మా బతుకులు ఎలాగని, పూట ఎలా గడుస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 మరో రెండు రోజుల్లో రూ.30 పెరిగే అవకాశం
 మరో రెండు రోజుల్లో సిమెంట్ ధరలు బస్తాకు మరో రూ.30 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా ఇం డ్లు నిర్మించుకునే వారు తలలు పట్టుకోవడంతో వ్యాపారాలు సా గడం లేదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. మరో 30 రూపాయలు పెరిగితే ఇళ్లు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రారని, వ్యాపారం సాగదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
 
 వ్యాపారం చాలా తగ్గింది
 గత నెలలో రోజుకు సుమారుగా 100 సిమెంటు బస్తాలను అమ్మెవారం. కానీ ఈ నెలలో సిమెంటు ధర విపరీతంగా పెరి గిపోవడంతో కొనుగోలు చేయడానికి ఇళ్లు నిర్మించుకునే వారు రావడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు అతికష్టంగా 30నుంచి 40బస్తాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మేస్త్రీలు పనులు కూడా చేయడం లేదు. ధరలు తగ్గితే తప్ప గిరాకీ వచ్చే అవకాశం లేదు.
 - కండె రమణ, సిమెంటు షాపు నిర్వాహకుడు, మిర్యాలగూడ
 
  ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
 సిమెంటు ధరలు విపరీతంగా పెర గడంతో సామాన్యులు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. గత నెలకు ఈ నెలకు  75 రూపాయలు పెరగడంతో మరింత భారంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా సిమెంటు ధరలు పెంచడమే కానీ తగ్గేది లేదు. అప్పులు చేసి గూడు నిర్మించుకుంటున్నాను. ధరలు పెరగడంతో అప్పులు కూడా పెరుగుతాయి. ఇల్లు నిర్మాణం మధ్యలో ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సిమెంట్ కొనుగోలు చేస్తున్నాను.
 - చక్రాల ఆగయ్య, తోపుచర్ల

 

మరిన్ని వార్తలు