కృష్ణా బోర్డు ఆదేశాలంటే లెక్కలేదా?

29 Nov, 2017 01:57 IST|Sakshi

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై కేంద్రం ఆగ్రహం

నీటి జలాల వినియోగంలో పదేపదే ఉల్లంఘనలపై మండిపాటు

ఇప్పటికైనా ఆదేశాలు పాటించాలంటూ ఇరు రాష్ట్రాలకూ లేఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీటి వినియోగం విషయంలో కృష్ణా బోర్డు వెలువరిస్తున్న ఆదేశాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆనవాయితీగా మారిపోయిందని తప్పుబట్టింది. ఈ విషయంలో ఇప్పటికైనా బోర్డు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ కుందూ ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖల కార్యదర్శులకు మంగళవారం లేఖలు రాశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పవర్‌హౌస్‌ ద్వారా తెలంగాణ, పోతిరెడ్డిపాడుతో ఏపీ చేస్తున్న అధిక నీటి వినియోగంపై కృష్ణా బోర్డు చేసిన ఫిర్యాదును ప్రస్తావిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. ‘బోర్డు త్రిసభ్య కమిటీ ఆమోదించి జారీ చేసిన ఆదేశాలను రెండు రాష్ట్రాలు ఉల్లంఘించాయి. ఇది రెండు రాష్ట్రాలకు ఆనవాయితీగా మారింది. శ్రీశైలం పవర్‌హౌస్‌ల కింద నీటి వినియోగం కేటాయింపులకు మించి జరగడంతోపాటు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ సైతం అదే రీతిన నీటిని తీసుకుంటోందని, వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని కోరినా ఇరు రాష్ట్రాలు పట్టించుకోలేదు.

పదేపదే నీటి వినియోగం ఆపాలని బోర్డు కోరుతున్నా, త్రిసభ్య కమిటీ ఆదేశాన్ని పక్కనబెట్టి నీటిని తోడుకుంటున్నాయి. ఇప్పటి నుంచైనా ఇరు రాష్ట్రాలు బోర్డు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరారు. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో తెలంగాణ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేయాలి’అని లేఖలో కుందూ పేర్కొన్నారు.


రాష్ట్రానికి 12.6 టీఎంసీలు.. ఏపీకి 14 టీఎంసీలు..
డిసెంబర్‌ వరకు తమ తాగు, సాగు నీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ, ఏపీ విజ్ఞప్తిపై కృష్ణా బోర్డు సానుకూలంగా స్పందించింది. తెలంగాణ అవసరాలకు 12.6 టీఎంసీలు, ఏపీకి 14 టీఎంసీల నీటిని కేటాయిస్తూ మంగళవారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు కేటాయించిన నీటిలో సాగర్‌ ఎడమ కాల్వ కింది అవసరాలకు 8 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 4.60 టీఎంసీలు కేటాయించారు.

ఏపీకి కృష్ణా డెల్టా కింది అవసరాలకు 10 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వ కింద మరో 4 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఎడమ కాల్వ కింద నీటి వినియోగం సమయంలో ఏపీ  తమకు కేటాయించిన నీటిని వాడుకుంటే సరఫరా నష్టాలను తగ్గించుకోవచ్చన్నా రు. సాగర్‌ ద్వారా ఎడమ కాల్వకు విడుదల చేసే నీటిని పవర్‌హౌస్‌ల ద్వారానే చేయాలని, విద్యుత్‌ అవసరాలు లేకుంటే స్లూయిస్‌ల ద్వారా విడుదల చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు