‘రీనాక్‌’ను అధిరోహించిన నల్లమల విద్యార్థి

13 Dec, 2016 03:25 IST|Sakshi
‘రీనాక్‌’ను అధిరోహించిన నల్లమల విద్యార్థి

సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కిన చరణ్‌రాజ్‌
అచ్చంపేట: నల్లమలకి చెందిన ఓ విద్యార్థి మంచు పర్వతం అధిరోహించి సత్తా చాటాడు. 20 రోజుల సాహస యాత్రలో భాగంగా  సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో హిమాలయంలోని డార్జి లింగ్‌లో ఉన్న రీనాక్‌ పర్వతాన్ని ఆధిరోహించాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పు నుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామానికి చెందిన పెబ్బేటి విజయ నిరంజన్ దంపతుల కుమారుడు చరణ్‌రాజ్‌ హైదరాబాద్‌ బీసీ హాస్టల్లో ఉంటూ కేశవ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. చరణ్‌కు మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ మంత్రి పి.రాములు ప్రోత్సాహంతో పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. నవంబర్‌ 13 నుంచి ఈనెల 10 వరకు దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 35 మందితో ఈ సాహస యాత్ర సాగింది.

బృందంలో తెలంగాణ నుంచి చరణ్‌రాజ్‌కు మాత్రమే అవకాశం లభించింది. అక్కడ బీసీ వెల్ఫేర్‌ ఫ్లెక్సీ, భారతదేశ త్రివర్ణపతాకం, అంబేడ్కర్‌ ఫ్లెక్సీని ఎగరవేశారు. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక 20 మంది మధ్యలోనే వెనుదిరిగారని, మిగతా 15 మందితో కూడిన బృందం రీనాక్‌ పర్వతాన్ని అధిరోహించిందని చరణ్‌రాజ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా చరణ్‌రాజ్‌ను సోమవారం హైదరాబాద్‌ చైతన్యపురిలోని తెలంగాణ బీసీ మహాసభ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. 

మరిన్ని వార్తలు