పటిష్ట చట్టంతో పల్లెకు పట్టం..

23 Oct, 2017 01:43 IST|Sakshi

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెస్తాం:  కేసీఆర్‌

పంచాయతీల పటిష్టతకు ప్రత్యేక చట్టం.. వచ్చే సమావేశాల్లోనే బిల్లు

గ్రామ వికాసానికి రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం

షెడ్యూల్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం.. పంచాయతీలుగా తండాలు

ముందు బంగారు వరంగల్, తర్వాతే బంగారు తెలంగాణ

మంత్రి కేటీఆర్‌కు, పరిశ్రమల శాఖ అధికారులకు నా సెల్యూట్‌

శాయంపేటలో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: గ్రామ పంచాయతీలను పటిష్టపరిచేందుకు ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతోపాటు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఆదివారం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్స్, వరంగల్‌ ఔటర్‌ రింగురోడ్డు, కాజీపేట ఆర్వోబీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. పంచాయతీలకు సంబంధించి తీసుకోనున్న చర్యలను వివరించారు. ‘‘ఓరుగల్లు పోరుగల్లు కాబట్టి.. విప్లవాలకు నాంది పలికే జిల్లా కాబట్టి.. ఈ రోజు ఇక్కడ్నుంచే మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నా. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెలకొల్పే దిశలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో విప్లవాత్మక చట్టాన్ని తెస్తాం. ఇందుకు రాబోయే శాసనసభలోనే బిల్లు ప్రవేశపెడతాం. ప్రభుత్వాలు పిరికిపందలుగా పారిపోతుంటాయి. రాజకీయ పార్టీలు పారిపోతుంటాయి. నేను ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచించను. గ్రామపంచాయతీల ఎన్నికలు కచ్చితంగా సమయంలోనే నిర్వహించి తీరుతాం. ఆ లోపు గిరిజన గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం. మధిర గ్రామాలను పంచాయతీలుగా మారుస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

నాలుగైదు వందల జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తాం. దీంతో మరో నాలుగైదు వేల గ్రామ పంచాయతీలు కొత్తగా వస్తాయి. ఈ పక్రియపై రేపు కేబినెట్‌ సమావేశంలో డిసైడ్‌ చేస్తాం. తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం. ఆ వెంటనే అమలు చేస్తాం. చట్టాలతోనే ఆగిపోం. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం. ఇన్ని దశాబ్దాలు గడిచినా గ్రామాలు మురికి కూపాలుగా ఉన్నాయి. వందశాతం ఆత్మవిశ్వాసంతో హామీ ఇస్తున్నా. స్వచ్ఛమైన అద్దాల్లాంటి గ్రామాలను ప్రజలకు పరిచయం చేయబోతున్నాం. గ్రామాల వికాసం కోసం రాబోయే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం. అతి చిన్న గ్రామానికి రూ.10 లక్షల నుంచి జనాభా ప్రతిపాదికగా రూ.25 లక్షల దాకా నిధులు కేటాయిస్తాం. వీటితో గ్రామాల్లో అద్భుతమైన క్రాంతి, గ్రామస్వరాజ్యం వస్తుంది. బాధ్యతాయుతమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది’’అని కేసీఆర్‌ అన్నారు.

టీఎస్‌ఐపాస్‌తో అద్భుతాలు
తెలంగాణ వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానానికి కొత్త రూపు తెచ్చేందుకు టీఎస్‌ ఐపాస్‌ విధానం అమల్లోకి తెచ్చామని సీఎం తెలిపారు. ‘‘ఇది తేంగనే ఇది జరుగతదా సార్‌.. ఐతదా సార్‌.. అని చాలా మంది మాట్లాడిళ్లు. కానీ ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్, నీరు, కాలుష్యం తదితర 57 రకాల అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఇప్పటివరకు 5,017 పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ పెట్టినా అనుమతులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’’అని అన్నారు. ఇప్పటిదాకా లక్షా ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని తెలిపారు. పరిశ్రమల శాఖ అధికారులకు, ఆ శాఖ మంత్రి రామరావుకు సెల్యుట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. టీఎస్‌ ఐపాస్‌ కారణంగానే వరంగల్‌లో టెక్స్‌టైల్స్‌ పార్కు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీలు వచ్చాయన్నారు. ‘‘వరంగల్‌ ప్రజల రక్తం మీద ఉన్న విశ్వాసంతో చెబుతున్నా. వందకు వందశాతం అద్భుతమైన పార్కుగా వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు రూపుదిద్దుకుంటది. పెట్టుకున్న పేరు కాకతీయ రాజులది. కాబట్టి బర్కత్‌ ఉంటది. సూరత్‌లో చీరలు, సోలాపూర్‌లో దుప్పట్లు, తిర్పూరులో బనీన్లు దొరుకుతాయి. కానీ వరంగల్‌లో ఒకేచోట అన్ని దొరికేలా రూపకల్పన చేశాం’’అని సీఎం చెప్పారు.

తొలిరోజు రూ.3,900 కోట్లు
కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన జరిగిన రోజు 22 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వీటి ద్వారా 3,900 కోట్లు పెట్టుబడులు రాబోతున్నట్లు వివరించారు. 27,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పార్కు కోసం భూములు కోల్పోయిన వారికి తప్పకుండా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘‘నిట్‌ వరంగల్, నిఫ్ట్‌ హైదరాబాద్, తిర్పూర్‌ విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. దీని ప్రకారం త్వరలో టెక్స్‌టైల్‌ పార్కు ప్రాంగణంలో వస్త్ర పరిశ్రమకు సంబం«ధించిన కాలేజీ ఏర్పాటు కాబోతోంది. టెక్స్‌టైల్‌ పార్కు అందుబాటులోకి రాబోతున్నందున ఇతర రాష్ట్రాలకు వలస పోయి ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులు తిరిగి వరంగల్‌కు రావాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలోనే అసంఘటిత రంగంలో ఉన్న రైతులను తొలిసారిగా సంఘటిత రంగంలోకి తెచ్చేందుకు రైతు సమితులను నెలకొల్పామని, పెట్టుబడికి ఏటా రూ.8 వేల చొప్పున అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఎంతో సాహసంతో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. గొల్లకుర్మలకు 25 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. అలాగే వివిధ వర్గాలను ఆదుకుంటున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదాయం పరంగా రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు.

మామునూర్‌ ఎయిర్‌పోర్టు పునరుద్ధరిస్తాం
తెలంగాణ రైతులు దేశంలోనే అత్యంత ధనిక రైతులు కావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘దేవాదుల ప్రాజెక్టు ఇక్కడే ఉంది. రాబోయే జూన్‌ లేదా ఆగస్టు వరకు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయి. చాలు సార్‌ అనేదాకా నీళ్లు అందిస్తాం. దమ్మున్న రైతులు మూడు పంటలు పండించుకోవచ్చు. బంగారు వరంగల్‌ తర్వాతే బంగారు తెలంగాణ వస్తుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మామునూర్‌ ఎయిర్‌పోర్టును పునరుద్ధరిస్తాం. పూర్తి స్థాయిలో విమానాశ్రయం ఏర్పాటు కాకున్నా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌలభ్యంగా పునర్నిర్మిస్తాం’’అని తెలిపారు.

పెట్టుబడులు.. ఉద్యోగాలు..
టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. వరంగల్‌లో ఆదివారం హరిత హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్‌ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇందులో కొరియాకు చెందిన యున్‌గోనే కార్పొరేషన్‌ ఉంది. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమల వివరాలివీ..

కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులో..
కంపెనీ                             పెట్టుబడి(రూ.కోట్లలో)    ఉద్యోగాలు
సూర్యవంశి స్పిన్నింగ్‌ మిల్స్‌            25            150    
సూర్యోదయ స్పిన్నింగ్‌ మిల్స్‌            10            100
శ్రీనాథ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌                50            200
అర్భాక్‌నిట్‌ ఫ్యాబ్స్‌                      125            200
శివాని గ్రూప్‌                            120            1200
గిన్ని ఫిలమెంట్స్‌                      100            500
ది స్వయంవర్‌ గ్రూప్‌                  50            500
వెల్‌స్పన్‌ గ్రూప్‌                          750            1000
యున్‌గోనే కార్పొరేషన్‌               1000            13000
గోకల్‌దాస్‌ ఇమేజెస్‌                    10            1000
నందన్‌ డెనిమ్‌ (చిల్పూరు గ్రూప్‌)    700            2000
శాహి ఎక్స్‌పోర్‌                              45            2250
జయకోట్‌ ఇండస్ట్రీస్‌                        20            150
జి.కె.థ్రెడ్స్‌ కంపెనీ                            15            100
–––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం                                   3,020            22,350
–––––––––––––––––––––––––––––––––––––––––––
ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలు..
సూర్యలత స్పిన్నింగ్‌ మిల్స్‌                  100            500
సీతారాం టెక్స్‌టైల్స్‌                            100            200
సూర్యలక్ష్మి కాటన్‌ మిల్స్‌                     50            200
శ్రీరాం స్పిన్నింగ్‌ మిల్స్‌                        15            50
జీఎంఆర్‌ స్పింటెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌            25            200
విజయలక్ష్మి స్పిన్‌టెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌     15            100
అష్టలక్ష్మి స్పిన్నింగ్‌ మిల్స్‌                    50            100
జీటీఎన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ                     25            100
–––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం                                           380            1,450
–––––––––––––––––––––––––––––––––––––––––––
ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారు: కడియం
కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఉద్యమంలో వెన్నంటి నిలిచిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా, రాష్ట్రంలో రెండో పెద్ద నగరం వరంగల్‌ నగరాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వరంగల్‌ నగరాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. పారిశ్రామికంగా ఐటీ రంగంలోనూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. నీటిపారుదల రంగంలోనూ ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు.

నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్‌
శంకుస్థాపన రోజే 22 కంపెనీలతో ఒప్పందం, 3,900 కోట్ల పెట్టుబడులు రావడం టెక్స్‌టైల్‌ పార్కు ఉజ్వల భవిష్యత్‌ను సూచిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కులో భూమిని కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎలాంటి కాలుష్యం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్కుకు భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దండం పెడుతూ కృతజ్ఞతలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు