వచ్చే విద్యాసంవత్సరం నుంచే.. కేసీఆర్‌ ప్రకటన!

20 Mar, 2018 18:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్ట్‌ బోధన తప్పనిసరి కానుంది. స్వయంగా తెలుగు భాషాభిమాని అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాతృభాషను బతికించుకునేందుకు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా తెలుగు సిలబస్‌ రూపొందించాలని తెలుగు వర్సిటీని, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్‌ కోరారు. సిలబస్‌లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు