ఇక్కడ ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతారు.!

20 Mar, 2018 18:31 IST|Sakshi

జైపూర్‌: ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసే కర్కశులూ లేకపోలేరు.  భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ  ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు.

ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. ఇలా నాటిన ప్రతి మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి  శ్రీకారం చుట్టింది రాజస్థాన్‌లోని పిప్లాన్‌ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ.. అటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్తులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 ఏ‍ళ్లుగా కొనసాగిస్తున్నారు.

ఓ వైపు సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు చేస్తున్న కార్యక్రమం నిజంగా సమాజానికి మేల్కొలుపు లాంటిదే. ఇటీవల ఆ గ్రామంపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ డ్యాక్యుమెంటరీ రూపొందించి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆ గ్రామ ప్రజలు నాటిన మొక్కలు, వారు మొక్కలపై తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేశారు. ఆడశిశువు జన్మను ప్రొత్సహిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు