పొరుగు ఇళ్లకు క్వారంటైన్‌ కష్టాలు

22 Mar, 2020 11:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొన్నటి వరకు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్నారు. నేడు కరోనా వైరస్‌ భూతం చేరింది. అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని  పొరుగిళ్లవారు.. మా ఇల్లు.. మా ఇష్టం ఇక్కడే ఉంటామని ప్రవాసీల పంతం. ఒకప్పుడు అమెరికాలో ఉన్నా.. లండన్‌ వెళ్లి వచ్చినా.. స్టేటస్‌ సింబల్‌గా భావించే జనం.. ఇప్పుడు మాత్రం విదేశాల పేరు చెబితేనే వామ్మో అంటున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని అమీన్‌పూర్‌ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక ఆపార్టుమెంటులో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్‌కు వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబసభ్యులు అమెరికా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు.

ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి కోవిడ్‌-19 లక్షణాలు లేకపోవడంతో పంపించేశారు. అయితే, ఈ విషయంలో ఆ నోటా..ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్లలో నివసించే జనం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రావాలని కోరేందుకు ఆపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి కుటుంబ సభ్యులు అంతెత్తున లేచారు. అసలు వీరిని పైకి(తమ ఫ్లోర్‌) ఎందుకు రానిచ్చారు అంటూ వాచ్‌మెన్‌పై ఎగబడ్డారు. చదవండి: విదేశీ ప్రయాణమే కొంపముంచిందా? 

ఆపార్ట్‌మెంటులో స్వీయ నియంత్రణ పాటించకుండా.. ఎడాపెడా సంచరిస్తున్న వీరితో ఆందోళనలో ఉన్న ఆపార్ట్‌మెంటు వాసులకు.. కనీసం టెస్టులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్న వీరి వైఖరి అంతుబట్టక లబోదిబోమంటున్నారు. చాలా ఆపార్ట్‌మెంట్లలో పరిస్థితి ఇలానే ఉంది. సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో విదేశాలకు వెళ్లివచ్చినవారిని సెల్ఫ్‌ క్యారంటైన్‌కు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, తమ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న వీరికి పక్క ఇళ్లవారితో చిక్కులు వస్తున్నాయి. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండకుండా ఇలా రావడం వల్ల తమ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టాల్సివస్తోందని లబోదిబోమంటున్నారు.

స్వేచ్ఛగా తిరిగిన తర్వాత బయటపడితే...
ప్రజలంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా బంధువులు, సన్నిహితులను కలుసుకుంటూ విందు, వివాహాలకు హాజరవుతూ జల్సా చేస్తున్నారు. విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఎలాంటి లక్షణాలు బయటపడలేదని చెబుతూ యథేచ్ఛగా సంచరిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న పౌరులపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలకంటే ముందే బంధుమిత్రుల ఇళ్లు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లిన వీరిపై ఇప్పుడు నియంత్రణ విధించడం విడ్డూరంగా కనిపిస్తోంది. వాస్తవానికి కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఈ రెండువారాలు స్వీయ నియంత్రణ పాటించకుండా.. క్వారంటైన్‌లో ఉండకుండా స్వేచ్ఛగా తిరిగిన అనంతరం.. ఈ లక్షణాలు కనిపిస్తే పరిస్థితేంటనేది ఆర్థం కావడంలేదు. ఇటీవల ఐర్లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వ్యక్తి మరుసటి రోజే వివాహ ఆహ్వాన పత్రికతో ఇంట్లో వాలడంతో సదరు ఆహ్వానితుడు భయపడుతూ.. కార్డు తీసుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేసిన మరో యువకుడు ఏకంగా మరుసటి రోజే పోలీసు ఉన్నతాధికారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పొతే.. లెక్కలేనంత మంది.. రాష్ట్రానికి రావడమేకాదు.. అందరితో కలివిడిగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలతోనే పాశ్చాత్య దేశాల్లో కరోనా విస్తృతి పెరిగిందనే సత్యాన్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది.

పేరు మార్పుతో తిప్పలు
కొసమెరుపు ఏమంటే..: చైనా పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. తాజాగా చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులు ప్రకటించడంతో ఇంటికి చేరాడు. అయితే, అతడు వచ్చింది చెన్నై నుంచి కాగా.. చైనా నుంచి వచ్చారనే పుకారు అందుకుంది. ఇంకేముందు పొద్దునే పోలీసులకు ఫోన్లు, తహసీల్దార్‌, ఎంపీడీవో, వైద్యాధికారుల పరుగో పరుగు. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఇదెక్కడ జరిగిందో తెలుసా నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం లక్ష్మాపూర్‌ తండా.

మరిన్ని వార్తలు