‘ఎమ్మార్పీ’పై ఫిర్యాదుల వెల్లువ

6 Aug, 2018 00:41 IST|Sakshi

టోల్‌ఫ్రీ, వాట్సాప్‌ల ద్వారా 274 ఫిర్యాదులు

ఇప్పటికే థియేటర్లు,మల్టీప్లెక్స్‌లపై 107 కేసులు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి భారీ ఎత్తున తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు అందుతున్నా యి. పాప్‌కార్న్, వాటర్‌బాటిల్, కూల్‌డ్రింక్స్, ఇతర తినబండారాల ఎమ్మార్పీ ధరలపై వినియోగదారులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉంచిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 00333, వాట్సాప్‌ 7330774444లకు ఇప్పటికే 274 ఫిర్యాదులు అందాయి.

ముఖ్యంగా పాప్‌కార్న్‌ చిన్న ప్యాక్‌ ధరను రూ.150 నుంచి రూ.200కు అమ్ముతు న్నారని, సమోసాలకు ఒక్కోదానిపై రూ.50 నుంచి రూ.75 వరకు ఎమ్మార్పీ పేరుతో వసూ లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి.  ‘బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌ ఐనాక్స్‌లో తినుబండారాల ధరల్లో మార్పు లేదు. ఇక్కడ చిన్న సైజు పాప్‌కార్న్‌ కప్‌ రూ.210 వసూలు చేశారు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయం మేరకే ధర నిర్ణయిస్తున్నామని చెబుతున్నారు’ అని ఒకరు ఫిర్యాదు చేశారు.

ఉప్పల్‌లోని ఏసియన్‌ థియేటర్‌లో 750 ఎంఎల్‌ వాటర్‌ బాటిల్‌ రూ.25 ఎమ్మార్పీకి అమ్ముతున్నారని మరొకరు వాట్సా ప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పీవీఆర్‌ పంజాగుట్టలోనూ బేకరి ఐటమ్‌ను టిక్కెట్‌తోపాటే విక్రయిస్తూ రూ.230 వసూలు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామంటూ అన్ని రకాల తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌పై ధరలు పెంచేస్తున్నారని, ఇది మరో దోపిడీ అంటూ వినియోగదారులు మొరపెట్టుకుంటున్నారు.  

కొరడా ఝళిపిస్తోన్న తూనికల శాఖ  
వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. 17 మల్టీప్లెక్స్‌ల్లో ఆదివారం తూనికల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 మల్టీప్లెక్స్‌లపై 15 కేసులు నమోదు చేశారు.

ఏసియన్‌ ముకుంద మేడ్చల్‌–1, సినిమా మంత్ర శంషాబాద్‌–2, పీవీఆర్‌ గెలీలియో–2, మహాలక్ష్మి కొత్తపేట–1, మిరాజ్‌ దిల్‌సుఖ్‌నగర్‌–1, జీవీకే వన్‌–1, సినిమా మంజీరామాల్‌ కూకట్‌పల్లి–1, బీవీఆర్‌ విజయలక్ష్మి ఎల్బీనగర్‌–1, రాధిక థియేటర్‌ ఎస్‌రావు నగర్‌–1, ఐనాక్స్‌ కాచిగూడ–2, ఏసియన్‌ సినిమా కూకట్‌పల్లి–1, ఏసియన్‌ షహీన్‌షా చింతల్‌–1 మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేసింది.

నిబంధనలు ఉల్లంఘించి, వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న మల్టీప్లెక్స్‌లు, థియేటర్లపై ఇప్పటివరకు మొత్తం 107 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు