ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు

11 Aug, 2015 01:54 IST|Sakshi

రైతులు, దళితులపై చిన్నచూపు
తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
వరంగల్ ఉప ఎన్నికే మనకు ఆయుధం
పరకాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టి.జీవన్‌రెడ్డి

 
పరకాల : ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మాటతప్పిన కేసీఆర్‌కు వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జీ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా నియమించిన రాజయ్యను అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కేసీఆర్ పదవి నుంచి తొలగించారని, ఆరు నెలలు గడుస్తున్నా రాజయ్య చేసిన అవినీతిని బయటపెట్టలేదన్నారు. దళితులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటతప్పారని, కేసీఆర్ ఇచ్చే మాఫీ.. వడ్డీలకు సరిపోదన్నారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన కేసీఆర్.. రైతులకు లాభం చేసే పనులు చేపట్టడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ పథకం పేరు చెప్పడానికి కేసీఆర్‌కు ఇష్టం లేకపోతే కవితమ్మ లేదా బతుకమ్మ పేరు పెట్టి పెండింగ్ బిల్లును అందించాలని జీవన్‌రెడ్డి సూచించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు విస్మరించారని, కేజీ నుంచి పీజీ ఊసేలేకుండా పోయిందన్నారు. విద్యార్థుల త్యాగాల ఫలితంగా చలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సపాయి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే గ్రామజ్యోతి పథకం విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. 1.10లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో చెప్పి.. ఇప్పుడు 15వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుమని చెప్పడం ఏమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

నెలకు పది వేల మంది ఉద్యోగాల నుంచి విరమణ పొందుతున్నా భర్తీ మాత్రం కావడం లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పర్మినెంట్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. వరంగల్ ఉప ఎన్నికను కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానికి ఆయుధంగా వాడుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సాంబారి సమ్మారావు, కట్కూరి దేవేందర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు బండి సారంగపాణి, మడికొండ సంపత్‌కుమార్, పసుల రమేష్, పంచగిరి జయమ్మ, నాగయ్య, క్రిష్టయ్య, చింతల కుమారస్వామి, ఆముదాలపల్లి మల్లేశ్‌గౌడ్, ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యుడు లేతాకుల సంజీవరెడ్డి, ఎంపీపీ గోపు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు