విద్యార్థినిల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన కోమటిరెడ్డి

29 Apr, 2019 18:35 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : శ్రావణి మృతదేహం తీసిన రోజే కాస్తా లోతుగా దర్యాప్తు చేసి ఉంటే.. మనీషా హత్య కూడా వెలికి వచ్చేదన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే డిగ్రీ విద్యార్థిని మనీషా శవం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. తెలంగాణలో కనీస మానవత్వం లేని ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డమ్మీ హోం మినిస్టర్‌తో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇంటర్‌ బోర్డ్‌ వైఫల్యంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. మరోవైపు ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు హత్యకు గురయ్యారని.. దీనిపై సీఎం, హోం మినిస్టర్‌తో సహా కనీసం జిల్లా మంత్రి కూడా స్పందిచలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. జిల్లాలో జోరుగా గంజాయి దందా సాగుతుందన్నారు. పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని.. ఫలితం‍గా పెద్ద ఎత్తున యువత మత్తుకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. కాగా, శ్రావణి, మనీషా కుటుంబాలకు కోమటిరెడ్డి.. చెరో యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు.

మరిన్ని వార్తలు