'ఆ హత్యకు టీఆర్‌ఎస్‌ నేతలే కారణం'

20 Sep, 2017 15:51 IST|Sakshi
'ఆ హత్యకు టీఆర్‌ఎస్‌ నేతలే కారణం'
హైదరాబాద్‌:  ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త వేముల శ్రీనివాస్ హత్యకు స్థానిక టీఆర్ఎస్ నేతలే కారణమని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తమ అరాచకాలు అడ్డుకుంటున్నారనే శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌ గుండాలు పొట్టనబెట్టుకున్నారని అన్నారు. నడిరోడ్డుపై హత్య చేస్తే కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది .. సీఎంకు సమాచారం అందడం లేదా అని నిలదీశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 
హంతకులను అరెస్ట్ చేయకపోవడానికి అధికార పార్టీ ఒత్తిడులే కారణమని తెలిపారు. వేముల శ్రీనివాస్‌ హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. హతుని కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. ఈ హత్యోదంతంపై డీజీపీతో మాట్లాడానని, చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమకు అండగా ఉండాలని శ్రీనివాస్ కుమారుడు గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి వేడుకోవడం హృదయాలను పిండివేసేలా ఉందని చెప్పారు. రేపు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇస్తామని చెప్పారు.
 
పోతిరెడ్డిపాడుకు కృష్ణానీటిని ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో చెప్పిన మాటలు ఎటుపోయాయి .. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కేసీఆర్‌కు ఏం అడ్డొస్తోందని అన్నారు. నాగార్జున సాగర్ కు నీళ్లు వచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పోలవరం విషయాన్ని సీఎం గాలికొదిలేశారని, అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలకు విలువలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
>
మరిన్ని వార్తలు