కాంగ్రెస్‌ పల్లెబాట

25 Nov, 2018 09:49 IST|Sakshi
గుడిహత్నూర్‌: డోంగర్‌గావ్‌లో ప్రచారం చేస్తున్న బోథ్‌ అభ్యర్థి సోయం బాపూరావు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మేడ్చల్‌ సభలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని చెప్పు కునేందుకు సోనియాగాంధీ ప్రసంగం కొండంత ధైర్యాన్నిచ్చిందని భావిస్తున్న అభ్యర్థులు తదనుగుణంగా ప్రచార కార్యక్రమాలను ప్లాన్‌ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు నుంచే అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కొత్త పంథాలో సాగాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని  దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గ్రామాలపైనే దృష్టి పెట్టి ప్రచారం నిర్వహించారు.

పట్టణ ప్రాంతంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించిన తీరుపై ఆగ్రహంతోనే ఉన్నారని భావిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు గ్రామాల్లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను టార్గెట్‌ చేసుకొని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగభృతి, రెండు లక్షల రుణమాఫీ, పింఛన్లు రెండింతలు పెంపు వంటి హామీలతో గ్రామీణ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తయి ప్రచారం ఊపందుకోవడంతో టికెట్ల కోసం పోటీపడ్డ నాయకులను సైతం అభ్యర్థులు కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. రెబల్స్‌గా బరిలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాల్లో మినహా అంతటా ఐక్యంగానే సాగుతుండడం గమనార్హం. 

మంచిర్యాలలో ప్రణాళికాబద్ధంగా...
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రణాళికబద్ధంగా ప్ర చారం సాగిస్తున్నారు. వివిధ కార్మిక యూనియన్లను, కుల సంఘాలను, ఎన్నికల్లో ప్రభావితం చేసే వర్గాలను పార్టీలో చేర్చుకొంటూనే మరో వైపు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఏకకా లంలో రూ.2లక్షల రుణమాఫీతో పాటు నిరుద్యోగభృతి, రైతులతో పాటు కౌలురైతులకు సైతం పెట్టుబడి సాయం అందిస్తామని చెపుతూ ప్రచా రం సాగిస్తున్నారు.

సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు తదితర హామీలతో ఆయా వర్గాలను ఆకట్టుకుంటున్నారు. ప్రేంసాగర్‌రావు తరుపున ఆయన సతీమణి సురేఖ సాగిస్తున్న ప్రచారం పలువురిని ఆకర్షిస్తోంది. శనివారం ఆమె హాజీపూర్‌లో మహిళలను టార్గెట్‌ చేసుకొంటూ గడప గడపకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు రెండింతలవుతాయని, అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి, నిరుద్యోగులకు నెలనెలా డబ్బులుచెల్లిస్తారని చెపుతూ మహిళలను ఆకర్షిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో మూడు ధ్రువాల  ఐక్యతారాగం
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు గండ్రత్‌ సుజాతకు రావడంతో సీటు కోసం పోటీపడ్డ మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి, భార్గవ్‌ దేశ్‌పాండే అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సుజాత వారిని కలిసి తనకు అండగా ఉండాలని కోరడం, అధిష్టానం నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో ప్రస్తుతం ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. శుక్రవారం సుజాతతో పాటు సీఆర్‌ఆర్, భార్గవ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది.

అయితే శనివారం ఆయా నేతల వర్గీయులు ప్రచారంలో సుజాత వెంట నడిచారు. మావల మండలంలో శనివారం ఆమె ప్రచారం నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయడం వల్ల ప్రస్తుతం అమలవుతున్న పథకాల వచ్చే మొత్తం రెండింతలవుతుందని చెప్పుకొచ్చారు. పెన్షన్లు రెండింతలు చేస్తున్నామని, ఇళ్లు లేనివారికి కొత్త ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇంటింటికి వెళ్లి మహిళగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. 

గ్రామాలను చుట్టేసిన మహేశ్వర్‌రెడ్డి 
నిర్మల్‌ నియోజకవర్గంలోని సారంగాపూర్‌ మం డలంలో శనివారం కాంగ్రెస్‌ అభ్యర్థి ఏల్లేటి మహేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని బీరపల్లి, ప్యారామూర్, తాండ్ర, వైకుంఠాపూర్, వంజర్, బోరిగాం, ఆలూరు గ్రా మాల్లో ఆయన గడప గడపకు కాంగ్రెస్‌ పేరుతో సాగించిన ప్రచారంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను వివరించి చెప్పారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిం దని, ప్రజలను మభ్యపెట్టారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయని, రైతులు గర్వపడే రీతిన పెట్టుబడి సాయం, పంటకు గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు అందించే పూచి నాదని మహేశ్వర్‌రెడ్డి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం.

చెన్నూరు గ్రామాల్లో వెంకటేష్‌ పాదయాత్ర
చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని గ్రామాల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్‌ నేత పాదయాత్ర పర్వం సాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్గామ, పుల్లగామ, రొయ్యలపల్లి, ఎదులబంధం, సిర్సా గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే సమకూరే ప్రయోజనాల గురించి వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు మేలు జరుగుతుందని, రాజకీయ నాయకుల దోపిడి ఉండదని చెప్పుకొచ్చారు. యువకులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ తొలిసారిగా రాష్ట్రంలో ఏటా లక్ష ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్‌ శ్రీకారం చుడుతుందని, ఉద్యోగం దక్కని వారికి నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి కూడా చెల్లించడం జరుగుతుందని చెపుతూ పాదయాత్ర సాగించారు. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టో... స్థానిక అంశాలు
బోథ్‌లో సోయం బాపూరావు ఆదివాసీ హ క్కులతో పాటు అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆయన కూడా గ్రామాలపైనే ఎక్కువ గురిపెట్టారు. ఆదివాసీలకు తోడు గిరిజనేతరుల ఓట్లే లక్ష్యంగా ఆయన ప్రచా రం సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని పేదవాళ్లందరికి సొంతిల్లు, పింఛన్లు రూ. 2,000 , ఆదివాసీల్లో చదువుకున్న వారందరికి ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రజ ల్లోకి తీసుకెళ్తున్నారు. సిర్పూరులో గత ఆరునెలలుగా ప్రజల మధ్యే ఉంటున్న హరీష్‌బాబు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆపార్టీ ఎన్నికల మేని ఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రచారంలో వివరిస్తున్నారు. ఖానాపూర్‌లో రమేష్‌ రాథోడ్‌ స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌ అవినీ తి, అక్రమాలను లక్ష్యంగా తన ప్రచారంలో తూర్పారపడుతున్నారు. ముథోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామారావు పటేల్‌ తనదైన రీతిలో గ్రామాలను చుట్టేస్తున్నారు.  

మరిన్ని వార్తలు