తెలంగాణలో మరో 269 కేసులు

17 Jun, 2020 21:57 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 214 కేసుల నమోదు

రంగారెడ్డిలో 13, వరంగల్‌ అర్బన్‌లో 10 కేసులు

ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,675

పరీక్షించిన వాటిలో 24.5 శాతం పాజిటివ్‌

బుధవారం పరిశీలించిన నమూనాలు 1,096

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 269 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,675కు చేరింది. ఇందులో ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. 3,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో బుధవారం ఒకరు మృతి చెందా రు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 192కు చేరింది.

పావు వంతు పాజిటివ్‌..
అనుమానితులు, లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తుండగా.. అందులో పావు వంతు నమూనాల్లో కరోనా పాజిటివ్‌ వస్తోంది. బుధవారం 1,096 నమూనాలు పరీక్షించగా.. అందులో 24.5 శాతం పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగించే విషయం. ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60.84 లక్షల నమూనాలు పరీక్షించగా, ఇందులో 3.54 లక్షల మందికి పాజిటివ్‌ వచ్చింది. దేశ సగటు 5.8 శాతంగా ఉంది. అయితే దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పాజిటివ్‌ వస్తున్న వాటి శాతం రెట్టింపుగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 45,911 నమూనాలు పరీక్షించగా, ఇందులో 5,675 మందికి పాజిటివ్‌ వచ్చింది. సగటున 12.3 శాతం నమూనాలకు పాజిటివ్‌ రావడం గమనార్హం.

‘గ్రేటర్‌’డబుల్‌ సెంచరీ..
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గ్రేటర్‌ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉంది. తాజాగా బుధవారం కేసుల సంఖ్య డబుల్‌ సెంచరీ దాటింది. బుధవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 214 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బ న్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగామలో 5, సంగారెడ్డి, మెదక్‌లో 3, వనపర్తి, మేడ్చల్‌ లో 2, ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వికారాబాద్‌ జిల్లా ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.

65 శాతం పురుషులే...
కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. తాజాగా రాష్ట్రంలో 5,675 కేసులు నమోదు కాగా, అందులో పురుషులు 3,671 (65 శాతం), మహిళలు 2,004 (35 శాతం) ఉన్నారు. వయసు రీత్యా పరిశీలిస్తే అత్యధికంగా 26–30 ఏళ్ల మధ్య వయసు వారే 679 మంది ఉన్నారు.

మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవాళ్లే..
కరోనా బారినపడి మరణించిన 192 మందిలో అత్యధికంగా 71 మంది మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ ఉన్నవాళ్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 35 మంది ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు ఉండటం గమనార్హం. మధుమేహంతో పాటు హృదయ సంబంధ వ్యాధులున్న వారు 21, హైపర్‌టెన్షన్‌ ఉన్నవాళ్లు 22 మంది, మధుమేహం మాత్రమే ఉన్నవాళ్లు 11 మంది, ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్లు 7, కేన్సర్‌ పేషెంట్లు 5, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వాళ్లు 5, గ్యాస్ట్రిక్‌–అల్సర్‌ ఉన్నవాళ్లు 1, హెచ్‌ఐవీ–టీబీ ఉన్న వాళ్లు 3, హైపర్‌ థైరాయిడిజం ఉన్నవాళ్లు 3, నరాల సంబంధిత సమస్యలున్న వాళ్లు 7, ఊబకాయం–హైపర్‌ టెన్షన్‌ ఉన్నవాళ్లు ఒకరు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు