రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన

9 Jun, 2018 10:59 IST|Sakshi
మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు 

కామేపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. శుక్రవారం ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మండల పరిధిలోని ఊట్కూర్, కామేపల్లి, తాళ్లగూడెం గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను కలిశారు. అనంతరం తాళ్లగూడెంలో మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. అవినీతిని అంతమొందిస్తామని, అవినీతి సొమ్మును బయటకు తీస్తామని చెప్పి మోదీ ఇంత వరకు ఎందుకు బయటకు తీయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు సంకెళ్లు వేయించి జైల్లో పెట్టారని, ఎన్నికల్లో లబ్ది పొందాలనే రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు.  

రైతు బంధు భూ స్వాములకే ప్రయోజనం..
రైతు బంధు పథకం భూస్వాములకే ప్రయోజనకరమన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటూ పట్టా కలిగి ఉన్న రైతులకు కూడా పెట్టుబడి చెక్కులు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కౌలు రైతులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులందరికీ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, సీఎం కేసీఆర్‌ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీలతో పని చేస్తామని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగి గెలుపొందేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శతకోటి సత్యనారాయణ, పుచ్చకాయల యర్రబాబు, లాల్‌సింగ్, బండి శ్రీను, కన్నమాల వెంటేశ్వర్లు, గండమాల రాములు, పుచ్చకాయల వెంకటకృష్ణ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా