సీపీఎం బహిరంగ సభ ప్రారంభం

22 Apr, 2018 19:18 IST|Sakshi

హైదరాబాద్‌: వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం అభ్యుదయ సామాజిక శక్తులన్నీ ఏకం కావాలనే ఆశయంతో సీపీఎం నిర్వహిస్తోన్న బహిరంగ సభ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, జాతీయ నేతలు ప్రకాష్‌ కారత్‌, బృందా కారత్‌‌, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు, తెలకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట టీవీ టవర్‌ నుంచి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వరకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.

బహిరంగ సభలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. లాల్‌ సలామ్‌, జైభీమ్‌ కలిస్తేనే కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. మూడో కూటమి విధానాలు చూసి కీలక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఓటమే తమ లక్ష్యమన్నారు. దేశంలో మతోన్మాత రాజకీయాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు.నిజాం, రజాకార్లను ఎదుర్కొన్న మగ్దూం మొహినుద్దీన్‌ స్పూర్తితో భవిష్యత్‌ కోసం ముందడుగు వేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు