క్రికెట్‌ క్రేజ్‌

16 Sep, 2019 12:35 IST|Sakshi
క్రికెట్‌ ప్రాక్టీస్‌ మ్యాట్‌

అకాడమీతో విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి

నిత్యం ప్రాక్టీస్‌ చేస్తూ బిజీబిజీ

సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

జిన్నారం(పటాన్‌చెరు): క్రికెట్‌పై విద్యార్థులు మక్కువ పెంచుకుంటున్నారు. ప్రాక్టీస్‌ చేసేందుకు నెట్లు, మ్యాట్‌ ఉండటంతో విద్యార్థులు క్రికెట్‌ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం కబడ్డీ, ఖోఖోలాంటి క్రీడలు కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడైన క్రికెట్‌ను ఆడేందుకు కూడా విద్యార్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. మండల కేంద్రమైన జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్రంలో మొదటి సారిగా క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేశారు. సుమారు రూ. 30లక్షల నిధులతో క్రికెట్‌ అకాడమీతోపాటు ప్రాక్టీస్‌ చేసేందుకు తగిన నెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఈ అకాడమీని ప్రారంభించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోనే ఈ క్రికెట్‌ అకాడమీ మొదటి కావడం విశేషం. క్రికెట్‌ను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన యువకులు, ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కేవలం కబడ్డీ, ఖోఖోలాంటి ఆటలు మాత్రమే ఆడేవారు. ప్రస్తుతం క్రికెట్‌ అకాడమీ  రావడంతో విద్యార్థులు క్రికెట్‌ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. క్రికెట్‌ అకాడమీని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. దీంతో విద్యార్థులకు క్రికెట్‌లో కూడా కోచింగ్‌ ఇచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు.

విద్యార్థులకు క్రీడల్లో ప్రాధాన్యం
విద్యతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోనే మొదటి సారి మా పాఠశాల ఆవరణలో క్రికెట్‌  అకాడమీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులు నిత్యం క్రికెట్‌ అడుతూ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. క్రికెట్‌లో కూడా విద్యార్థులు రాణించేలా మావంతు కృషి చేస్తాం. – గంగాధర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌

మరిన్ని వార్తలు