సాగుకు ‘సోలార్’ సాయం

22 Dec, 2014 23:26 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: కరెంటు లోటు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని వ్యయసాయశాఖ  మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయం, మిషన్ కాకతీయ, ఆహారభద్రత కార్డుల పంపిణీపై సోమవారం ప్రత్యేక జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ సోలార్ పంపుసెట్లపై కిర్లోస్కర్ కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదన్నారు. బోరుబావులున్న రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న కరెంటు సబ్సిడీ మొత్తాన్ని తమకు చెల్లిస్తే సోలార్ పంపుసెట్టు బిగిస్తామని కిర్లోస్కర్ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. కిర్లోస్కర్ ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. వ్యవసాయ, అనుబంధశాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని సాగుకు ‘సోలార్’  సాయం తెలిపారు.

పశువైద్యశాలలు లేనిచోట్ల పశువువైద్య సేవలు అందించేందుకు 70 నియోజకవర్గాల్లో సంచార పశువైద్యశాలలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. వ్యవసాయరంగానికి రూ.1828 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాబోయే మార్చిలోగా ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

పాలీహౌస్, గ్రీన్ హౌజ్‌ల ఏర్పాటు కోసం రైతులకు 75 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం రూ.89 కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. మెదక్ జిల్లాలో విత్తన్న ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయశాఖ అనుబంధశాఖలైన ఉద్యావనం, మత్య్సశాఖ, డెయిరీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఆర్హులందరికీ ఆహారభద్రత కార్డులు : మంత్రి ఈటెల రాజేందర్
అర్హులైన వారందరికీ ఆహారభద్రతకార్డులు అందజేస్తామని ఆర్థిక శాఖ  మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షలకుపైగా ఆహారభద్రత కార్డుల లబ్ధిదారులను గుర్తించినట్లు చెప్పారు. ఆహారభద్రతకార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు