తప్పనున్న నీటి తిప్పలు

21 Mar, 2019 16:21 IST|Sakshi
ట్యాంకర్‌ నుంచి నీటిని పట్టుకుంటున్న గ్రామస్తులు

 తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు

 ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ

 ఈనెల  చివరినాటికి  మిషన్‌ భగీరథ నీరు  

సాక్షి, దామరచర్ల : మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు దృష్టి సారిస్తోంది. మిషన్‌ భగీరథ పైపులైన్ల ద్వారా ఈనెల చివరినాటికి అన్ని గ్రామాలకు నీరు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అప్పటిలోగా తాగునీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వినియోగించనున్నారు. వేసవి వచ్చిందంటే చాలు దామరచర్ల మండల ప్రజల్లో తాగునీటి వెతలు తప్పడం లేదు. ఈఏడాది వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య ఎదురైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్యలపై అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. 

నెలాఖరులోగా మిషన్‌ భగీరథ నీరు
దామరచర్ల మండలంలో ఈనెల చివరి నాటికి అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పనుల వేగాన్ని పెంచారు. మండలంలో మిషన్‌ భగీరథ పనులకు రూ.25.40 కోట్లు మంజూరయ్యాయి. మండలంలో మొత్తం 71 ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 36 పూర్తయ్యాయని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మండలంలోని 53 ఆవాస గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు వేస్తున్నారు. ఇప్పటికే  49 గ్రామాల్లో పూర్తయ్యాయని, మరో వారంలోగా మిగిలిన 4 గ్రామాల్లోనూ పైపులైన్లు పూర్తికానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీలున్నచోట్ల మరమ్మతులు చేయించి, ఈనెల చివరిలోగా అన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ బ్రహ్మం బాబు  చెబుతున్నారు.

ట్యాంకర్ల ద్వారానీటి సరఫరా
మండల ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని ఎర్రనామ్, వీరభద్రాపురం ప్రాంతాలతో పాటుగా తాళ్లవీరప్ప గూడెం, నర్సాపురం, కేశవాపురం, గాంధీనగర్, కల్లేపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దామరచర్ల, తాళ్లవీరప్ప గూడెంలలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

తాగునీటి సమస్యలున్న మిగిలిన గ్రామాల్లో సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అవసరమైన చోట్ల  రైతుల బోర్లను అద్దెకు తీసుకొని ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు.  భూగర్భజలాలు పెంచేందుకు చెరువులు నింపాలని ప్రజలు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు