అమ్మగా మారిన కూతురు

14 Aug, 2019 10:42 IST|Sakshi
తల్లి రాధకు అన్నం తినిపిస్తున్న శ్రీవల్లి

సాక్షి, వెంకటాపురం(వరంగల్‌) : అందరు పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ  గడపాల్సిన ఆ చిన్నారి అలా చేయడంలేదు. మతిస్థిమితం కోల్పోయిన కన్నతల్లికే అమ్మగా మారి సేవచేస్తుంది. బడికి పోయి చదువుకోవాల్సిన ఆ బాలిక తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ములుగు జిల్లా వెంకటాపురంలోని ఎస్సీకాలనీకి చెందిన గాజుల రాజమ్మ–దుర్గయ్యల కుమార్తె రాధను హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ శంకర్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి శ్రీవల్లి(9), అమ్ములు (2) ఇద్దరు పిల్లలు జన్మించగా రాధ మూడు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయింది.

ఎవరినీ గుర్తు పట్టకపోవడంతో భర్త శంకర్‌ భార్య, పిల్లలను వెంకటాపురంలోని తల్లి రాజమ్మ వద్ద  వదిలేసి వెళ్లిపోయాడు. జూన్‌లో ములుగులోని ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలలో శ్రీవల్లిని ఐదో తరగతిలో చేర్పించారు. అయితే, మతిస్థిమితం కోల్పోయిన రాధ గ్రామంలో తిరుగుతూ అందరినీ కొడుతోంది. ఈ క్రమంలో 10రోజుల క్రితం రాధ తల్లి రాజమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో  రాధ ఆలన పాలన చూసుకునేవారు లేరు. దీంతో శ్రీవల్లి చదువు మానేసి ఇంటికి వచ్చేసింది. కన్నతల్లికి అమ్మగా మారి స్నానం చేయిస్తూ, దుస్తులు వేస్తూ, అన్నం తినిపిస్తూ సేవలందిస్తుంది. అంతేకాకుండా చెల్లి అమ్ములు, అమ్మమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ చిన్న వయస్సులోనే పెద్దకష్టం అనుభవిస్తోంది. ఈ మేరకు రాధకు చికిత్స జరిగేలా దాతలు చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అమ్మకు ఏమైందో తెలియదు
మా అమ్మకు ఏమైందో తెలియదు. నన్ను, మా చెల్లిని చూస్తే కూడా కొడుతుంది. అమ్మను ఆస్పత్రి ఎక్కడికి, ఎలా తీసుకెవెళ్లాలో తెలియదు. అమ్మ కోసం హాస్టల్‌ వదిలి ఇంటికొచ్చా. బడికి పోకున్నా మంచిదే కానీ మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి. నేను లేకపోతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు? మా అమ్మమ్మకు కూడా జ్వరం వచ్చింది. 
– శ్రీవల్లి, కూతురు 

మరిన్ని వార్తలు