కేసీఆర్‌పై ‘క్విడ్‌ప్రోకో’ సీఎల్పీ నేత భట్టి డిమాండ్‌ 

10 May, 2019 06:01 IST|Sakshi

ఖమ్మంరూరల్‌: పార్టీ ఫిరా యింపులకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌పై క్విడ్‌ప్రోకో కింద చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం పోలేపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కేసీఆర్‌ చేస్తున్న కుట్రలు, తప్పిదాలతో ప్రజాస్వామ్యం అభాసు పాలవుతోందన్నారు. తన స్వార్థం కోసం, అహంకార ధోరణితో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే స్పీకర్‌ వారి సభ్యత్వాలను రద్దు చేయాలన్నారు. దురదృష్టవశాత్తు స్పీకర్‌ కూడా సీఎం కనుసన్నల్లోనే ఉంటూ.. రాజ్యాంగాన్ని విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితమైన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దేశం అంతా వైరస్‌లా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పాలేరు ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు