డీలిమిటేషన్ కొలిక్కి

29 Oct, 2015 07:11 IST|Sakshi
డీలిమిటేషన్ కొలిక్కి

జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య యథాతథం 

*  ముసాయిదా జాబితా విడుదల
* జనాభా ప్రాతిపదికన డివిజన్లలో మార్పులు
* అభ్యంతరాలు, సూచనలకు వారం గడువు
* ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలకు అవకాశం!
 
 సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ముసాయిదా జాబితా విడుదలైంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల (వార్డుల) సంఖ్యలో ఎలాంటి మార్పు లేనప్పటికీ జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల ఆధారంగా కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తూ  బుధవారం రాత్రి ముసాయిదాను జారీ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తెర లేచినట్లయింది. డీలిమిటేషన్ తర్వాత డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. అందుకు బీసీ జనగణన చేపట్టాల్సి ఉంది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు, జనగణన డెరైక్టరేట్ ద్వారా అందిన జనాభా లెక్కల ప్రకారం డివిజన్ల విభజన చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

కొత్తగా వచ్చిన డివిజన్లలో సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, ఈస్ట్ ఆనంద్‌బాగ్, వెంకటాపురం, నేరేడ్‌మెట్, వినాయకనగర్, వెంకటేశ్వరకాలనీ, మోండా మార్కెట్, లింగోజీగూడ, నాగోల్, బీఎన్‌రెడ్డి నగర్, రంగారెడ్డినగర్, సుభాష్‌నగర్, అల్లాపూర్, భారతినగర్, ఏఎస్‌రావునగర్, మీర్‌పేట, చిలుకానగర్ హస్తినాపురం, చైతన్యపురి, గోల్కొండ, ఆబిడ్స్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, బాలానగర్, ఆల్విన్‌కాలనీ ఉన్నాయి. ఇక కనుమరుగైన వాటిలో శివరాంపల్లి, శ్రీనగర్‌కాలనీ, గన్‌ఫౌండ్రి, సుల్తాన్‌బజార్, పద్మారావునగర్, బల్కంపేట తదితర డివిజన్లు ఉన్నాయి.

పూర్తి వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్www.ghmc. gov.in లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ముసాయిదా జాబితాను జీహెచ్‌ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న 150 ఎన్నికల వార్డులకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను వారం రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు.
 జనవరి రెండో వారం కల్లా ఓటర్ల జాబితా
 ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసేందుకు దాదాపు నెల రోజులు పట్టనుంది. నెల రోజుల్లో డీలిమిటేషన్ పూర్తయ్యాక వార్డులను బీసీ జనాభాను సర్వే చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. బీసీ గణన పూర్తయితే వార్డుల్ని ఆయా వర్గాల వారికి రిజర్వ్ చేస్తారు. ఈ సర్వే డిసెంబర్ మూడో వారంలోగా పూర్తి చేయవచ్చని అంచనా. ఓటర్ల జాబితా జనవరి రెండో వారంకల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ లెక్కన వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు