కాలితో తొక్కితే చాలు.. చేతిలోకి శానిటైజర్‌ చుక్కలు..

1 May, 2020 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై శానిటైజర్‌ బాటిల్‌ను చేతితో నొక్కాల్సిన పనిలేదు. కాలితో తొక్కితే చాలు...మీ చేతిలో శానిటైజర్‌ చుక్కలు పడతాయి. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా మెషిన్‌ రూపొందించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ) విద్యార్థుల సాయంతో దీన్ని తయారు చేసింది. చేతితో శానిటైజర్‌ బాటిల్‌ను పట్టుకోవడంతో వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొందరు ఐటీఐ విద్యార్థులు ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీన్ని ఇటీవల మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఉచితంగా అందించారు. త్వరలో వంద మిషన్లు తయారు చేసి డిమాండ్‌ ఉన్న సంస్థలకు అందించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కె.వై.నాయక్‌ తెలిపారు.

40వేల మాస్కుల ఉచిత పంపిణీ 
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కుట్టుమిషన్‌ ట్రేడ్‌ ఉన్న వాటిల్లో మాస్కుల తయారీకి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదేశించింది.ప్రస్తుతం 15 ప్రభుత్వ ఐటీఐలు, 5 ప్రైవేటు ఐటీఐలలో మాస్కులను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, వైద్య,ఆరోగ్య శాఖ సూచనల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మాస్కులు కొనుగోలు చేయలేని కూలీలు, పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు తయారు చేసిన 40వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్టు  ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఐటీఐ శిక్షణ: ఐటీఐల్లోనూ ఆన్‌లైన్‌ బోధన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్నైలోని నేషనల్‌ ఇన్‌స్ట్రక్షన్‌ మీడియా ఇన్‌స్టిట్యూట్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ సాయంతో ప్రస్తుతం 63 ప్రభుత్వ ఐటీఐలు, 13 ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండగా... ఈ వారాంతంలోగా అన్ని ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన అందుబాటులోకి రానుంది. 

మరిన్ని వార్తలు