‘హ్యాట్రిక్‌’ మోత...

17 May, 2018 01:39 IST|Sakshi

     డీజిల్‌ ధర ఆల్‌టైం రికార్డు 

     మూడు రోజుల్లో పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 75 పైసల పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ ధరల మోత మళ్లీ మోగుతోంది. చమురు సంస్థలు 19 రోజుల విరామం తర్వాత మళ్లీ విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోజువారీ ధరల సవరణ జోలికి వెళ్లని దేశీయ మార్కెటింగ్‌ సంస్థలు పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి రోజువారీ ధరల సవరణకు దిగాయి. మూడు రోజులుగా రోజుకు పెట్రోల్‌పై 15 నుంచి 22 పైసలు, డీజిల్‌పై 21 నుంచి 26 పైసలు పెరిగాయి. రోజువారీ ధరల సవరణ అనంతరం దేశంలోనే హైదరాబాద్‌లో డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టిస్తుండగా... పెట్రోల్‌ ధర రెండో స్థానంలో రికార్డుగా నమోదైంది. 

మూడు రోజుల్లో.. 
మూడు రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 75 పైసలు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌పై 46 పైసలు, డీజిల్‌పై 68 పైసలు, ఢిల్లీలో పెట్రోల్‌పై 47 పైసలు, డీజిల్‌పై 64 పైసలు, బెంగళూరులో పెట్రోల్‌పై 49 పైసలు, డీజిల్‌పై 67 పైసలు పెరిగాయి. ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో చమురు సంస్థలు సైలెంట్‌గా బాదేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు