శ్రీరాముడికి జలాభిషేకం! 

19 May, 2020 03:06 IST|Sakshi
సోమవారం జలసౌధలో జరిగిన సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌

ఎస్సారెస్పీ ఆయకట్టుకు జూలై నుంచి నీటి పంపిణీ

ఎస్సారెస్పీ–1, 2, మిడ్‌మానేరు, అలీసాగర్, గుత్ఫా కింద 16.40 లక్షల ఎకరాలకు నీరు

వచ్చే వరద అంచనా మేరకు కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీకి గోదావరి ఎత్తిపోత

కాళేశ్వరం ద్వారా 200 టీఎంసీల తరలింపు.. 2,200 చెరువులు నింపడమే కనీస లక్ష్యం

సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు.. ఇటు అధికారులతో మరోమారు రజత్‌కుమార్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే వానాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద పూర్తి ఆయకట్టు సాగులోకి తెచ్చేలా బృహత్‌ ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కింద నిర్ణయించిన పూర్తి ఆయకట్టుకు నీరివ్వడంతో పాటే ప్రతి చెరువును నింపి నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు జూలై నుంచి నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల మేరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

మొత్తం ఆయకట్టుకు నీరు..
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్‌–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్‌–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గతేడాది వానాకాల సీజన్‌లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నీటి వినియోగం పెద్దగా అవసరం లేక పోయింది. అదే యాసంగి సీజన్‌లో మాత్రం స్టేజ్‌–1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజ్‌–2 కింద 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. దీనికోసం మొత్తంగా 90 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇందులో 25 నుంచి 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా తరలించిన నీటి వాటా ఉంది. అయితే ఈ ఏడాది స్టేజ్‌–1, 2ల కింద ఉన్న మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు జూలై ఒకటి నుంచే నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు.

సాధారణంగా ప్రాజెక్టులోకి ఆగస్టు నుంచి అధిక ప్రవాహాలుంటాయి. గత పదేళ్ల ప్రవాహాల లెక్కలు తీసుకుంటే జూన్, జూలైలో వచ్చిన ప్రవాహాలు సగటున 10 నుంచి 15 టీఎంసీల మేర ఉండగా, ఆగస్టులో 50 నుంచి 60 టీఎంసీలుంది. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎస్సారెస్పీలో 30 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఇందులో 10 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి మిగతా 20 టీఎంసీల నీటిని జూలై నుంచే సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్ఫా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్‌మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్‌మఠ్, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు.

వస్తే వరద.. లేదంటే ఎత్తిపోత
ఆగస్టులో ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేసుకుంటూ, ప్రవాహాలు ఉంటే ఆ నీటితో, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే లోయర్‌ మానేరు కింద 5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుంచే స్టేజ్‌–2 కింద సూర్యాపేట జిల్లా వరకున్న 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇక ఎల్‌ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడితే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి తరలించి, ఆయకట్టుకు నీరివ్వనున్నారు. ఇప్పటికే పునరుజ్జీవ పథకం పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు.

ఈ సీజన్‌లో కాళేశ్వరం ద్వారా కనీసంగా 200 టీఎంసీల ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటితో పాటే కాళేశ్వరం నీటిని కలిపి మొత్తంగా 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వరద కాల్వ కింద 49, ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, కాళేశ్వరం కింద మరో 1,200 చెరువులున్నాయి. ఆరునూరైనా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ప్రతి చెరువునూ నింపడం లక్ష్యంగా సాగు నీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఇదే అంశమై సోమవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు