గంటన్నరలోనే డీఎన్‌ఏ రిపోర్ట్‌!

31 Mar, 2017 02:47 IST|Sakshi
గంటన్నరలోనే డీఎన్‌ఏ రిపోర్ట్‌!

ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి అత్యాధునిక పరికరాలు
వేగంగా పరీక్షలు చేసేలా ర్యాపిడ్‌ హిట్‌ సాంకేతికత
బాంబులను నిర్వీర్యం చేసేందుకు స్పెషల్‌ రోబో
అనుమానితులను ప్రశ్నించేందుకు సూపర్‌ పాలీగ్రాఫ్‌
డ్రగ్స్, పేలుడు పదార్థాలు గుర్తించేందుకు స్పెక్ట్రో మీటర్‌
కాల్పుల కేసులు ఛేదించేందుకు ప్రత్యేక మైక్రోస్కోప్‌
మరికొన్ని ఆధునిక పరికరాలు కూడా..
రూ. 20 కోట్లతో కొనుగోలు చేయనున్న పోలీసు శాఖ  


సాక్షి, హైదరాబాద్‌
అత్యాచారాల కేసులు.. పిల్లల గుర్తింపు.. గుర్తు తెలియని మృతులు.. ప్రమాదాల్లో మరణించినవారు.. ఇలాంటి కేసులను సత్వరమే తేల్చేందుకు సాంకేతిక ఆధారాలు అవసరం. ముఖ్యంగా డీఎన్‌ఏ పరీక్ష కోసమైతే ఇప్పటివరకు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇలాంటి కేసుల్లో సత్వర దర్యాప్తు, విచారణకు తోడ్పడేలా కేవలం 90 నిమిషాల్లోనే డీఎన్‌ఏ రిపోర్టులను సిద్ధం చేసే సరికొత్త పరికరాలను రాష్ట్ర పోలీసు శాఖ సమకూర్చుకుంటోంది. అంతేకాదు బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు, నకిలీ నోట్లు, ఫోర్జరీల గుర్తింపు వంటి కేసుల్లోనూ తోడ్పడే అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులకు ఈ పరికరాల సహాయంతో పరిష్కారం లభించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ‘పోలీసు దళాల ఆధునీకరణ (మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌ –ఎంఓపీఎఫ్‌)’నిధుల కింద ఈసారి రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి రూ.20 కోట్లను కేటాయించింది. ఆ నిధులతోనే ఆధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.

పెండింగ్‌లో 1,500 కేసులు
రాష్ట్రంలో 1,500 పైగా లైంగిక దాడులు, అత్యాచారాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన ఛేదించేందుకు ర్యాపిడ్‌ హిట్‌ పరికరాన్ని కొనుగోలు చేశామని పోలీస్‌ శాఖ వెల్లడించింది. ఈ ర్యాపిడ్‌ హిట్‌ టెక్నాలజీ ద్వారా కేవలం 90 నిమిషాల్లో డీఎన్‌ఏ పరీ„క్షý నిర్వహించి, ఫలితాలు వెల్లడవుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇలాంటి డీఎన్‌ఏ టెస్ట్‌ పరికరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో కాస్త అత్యాధునిక టెక్నాలజీ ఉన్న చండీగఢ్, పుణె, సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో కేసుల పరీశీలన జరుగుతోంది. ఇక నుంచి రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ద్వారానే డీఎన్‌ఏ రిపోర్టులు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

సూక్ష్మ పదార్థాల విశ్లేషణకు ఎక్స్‌రే..
అతి చిన్న వస్తువులు, పేలుడుకు ఉపయోగించే పౌడర్, ద్రవాలు తదితరాలను గుర్తించి విశ్లేషించేందుకు ఏడీఎక్స్‌–2700 ఎక్స్‌రే పరికరాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీని ద్వారా అతి తక్కువ సమయంలో వివిధ రకాలైన రసాయనిక సమ్మేళనాలను విశ్లేషించవచ్చు.

కాల్పుల కేసుల కోసం కంపారిజన్‌ మైక్రోస్కోప్‌
తుపాకీ కాల్పులు జరిగిన సందర్భంలో, ఎన్‌కౌంటర్ల వంటి కేసుల్లో త్వరితగతిన బాలిస్టిక్‌ రిపోర్ట్‌ రూపొందించేందుకు కీలకమైన పరికరాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఫైరింగ్‌ సందర్భంగా గన్‌ క్యాట్రిడ్జ్‌ నుంచి బుల్లెట్‌ దిగిన దూరం, వేగం వంటి వాటికి సంబంధించి కచ్చితమైన నివేదిక రూపొందించేందుకు ఫోరెన్సిక్‌ కంపారిజన్‌ మైక్రోస్కోప్‌ అందుబాటులోకి రాబోతోంది.

నేర స్థలంలోనే పక్కా రిపోర్ట్‌
డ్రగ్స్, పేలుడు పదార్థాలు, పేలుడుకు ఉపయోగించిన రసాయనాల మిశ్రమం వంటి వాటిని పక్కగా, వెంటనే గుర్తించేందుకు ‘హ్యాండ్‌ హెల్డ్‌ రామన్‌ స్ప్రెక్టో మీటర్‌(నానో రామన్‌)’పరికరం అందుబాటులోకి రాబోతోంది. నేరం జరిగిన ప్రదేశంలోనే పదార్థాల విశ్లేషణకు దీనిని వినియోగించుకోవచ్చు. అదే విధంగా ఇన్‌డోర్‌ యూనిట్‌లో భారీ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు పోర్టబుల్‌ రామన్‌ స్ప్రెక్టో మీటర్‌ను కూడా కొనుగోలు చేయనున్నారు.

కుట్రను ఛేదించేందుకు పాలీగ్రాఫ్‌
తీవ్రమైన నేరాలు, పేలుళ్లకు సంబంధించిన నేరాలు, వాటికి కుట్రపన్నిన వారిని ప్రశ్నించి.. నిజాలు రాబట్టేందుకు అత్యాధునిక పాలీగ్రాఫ్‌ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. ఈ పరికరాన్ని వినియోగించి ప్రశ్నించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఉండాల్సిందే. అయినా ముందస్తు సంసిద్ధతలో భాగంగా పోలీసు శాఖ దీనిని కొనుగోలు చేస్తోంది.

నకిలీ నోట్లు.. ఫోర్జరీ కేసుల కోసం
సంతకాలు ఫోర్జరీ చేయడం, నకిలీ నోట్లు ముద్రించి, చలామణీ చేయడం, బార్‌కోడ్‌ ట్రేసింగ్, ఆర్‌ఎఫ్‌ఐడీ.. వంటి అంశాలను ఛేదించడంలో తోడ్పడే ‘అడ్వాన్స్‌డ్‌ వీడియో స్పెక్ట్రల్‌ ఎక్విప్‌మెంట్‌’అందుబాటులోకి వస్తోంది.

బాంబుల నిర్వీర్యానికి రోబో
బాంబులను నిర్వీర్యం చేసేందుకు రిమోట్‌ రోబోను రంగంలోకి దింపనున్నారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక బలగాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించడం లేదు. మన రాష్ట్రంలోనే తొలిసారిగా ‘పోర్టబుల్‌ రేడియోగ్రఫీ రిమోట్‌
రోబో’ను తీసుకువస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ పరికరాలు!
ఆడియో వీడియో అనాలిసిస్, నేరస్థలంలో పాదముద్రలు, 3డీ లేజర్‌ రోబో స్క్రీనింగ్, మానవ శరీరంలో ఆల్కాహాల్, రసాయనాల గుర్తింపు కోసం 8 అత్యాధునిక పరికరాలను కూడా కొనుగోలు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు