మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి

27 Dec, 2018 07:35 IST|Sakshi
రోదిస్తున్న పసికందు బంధువులు, శిశువు మృతదేహం

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ శిశువు బంధువుల ఆందోళన

నల్లగొండ టౌన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాలుగురోజుల శిశువు మృతిచెందాడు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.   వివరాలు.. రా మన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన గిరి భార్య శిరీష ఈ నెల 24న ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. అదే రోజు శిరీష మగబిడ్డను జన్మనిచ్చింది.

ఆస్పత్రిలో తల్లిబిడ్డ చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం ఉదయం బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శిశువు మృతదేహంతో ఎంసీహెచ్‌ ఎధుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బాలుడిని బలితీసుకుందని తల్లిదండ్రులతో పాటు బంధువులు విలపిస్తూ తెలిపారు. పసికందు చనిపోయిన తర్వాతనే ఎన్‌ఐసీకి తీసుకువచ్చారని డాక్టర్‌ దామెర యాదయ్య సాక్షికి తెలిపారు. సీసీ పుటేజీలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించుకోవచ్చన్నారు. బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.

మరిన్ని వార్తలు