ప్రాణభిక్ష పెట్టరూ..

13 Jun, 2014 03:57 IST|Sakshi
ప్రాణభిక్ష పెట్టరూ..
  • క్యాన్సర్ బారిన కొడుకు
  • చికిత్స చేయించలేని స్థితిలో తల్లిదండ్రులు
  • దాతలు ఆదుకోవాలని వేడుకోలు
  • మామడ మండలం పోతారం గ్రామానికి చెందిన చిరువ్యాపారి పబ్బవార్ లక్ష్మణ్, శ్రీదేవి దంపతుల ఏకైక కుమారుడు శ్రీకర్(20). అతడు మొదటినుంచీ చదువులో ప్రతిభ కనబర్చేవాడు. ఇంటర్మీడియెట్ అనంతరం సీఏ కోర్సు చదువుతానంటే రెండేళ్ల క్రితం విజయవాడలోని కళాశాలలో చేర్పించారు. కుమారుడు సీఏ పూర్తిచేసి తమ కుటుంబానికి అండగా ఉంటాడని తల్లిదండ్రులు ఆశించారు. వారి అంచనాల మేరకు సీఏ మొదటి సంవత్సరంలో శ్రీకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. సెకండియర్ చదువుతుండగా ఓ రోజు అతడికి కడుపునొప్పి రావడంతో స్నేహితులు ఆస్పత్రిలో చూపించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
     
    వారు చేరుకొని కొడుకును ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షల అనంతరం శ్రీకర్ లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు ఏడు నెలల క్రితం ధ్రువీకరించారు. ఇది తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కుమారుడిని విజయవాడ, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చూపించారు. అప్పులు తెచ్చి ఇప్పటి వరకు సుమారు రూ.5 లక్షల వరకు చికిత్సకు వెచ్చించారు. ప్రస్తుతం కిమోథెరపీ చికిత్స చేయిస్తున్నారు. శ్రీకర్‌కు 15 రోజులకు ఒకసారి వైద్యులు రూ.30 వేల విలువైన ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు.
     
    చికిత్స మరికొంత కాలం కొనసాగించాలని వైద్యులు చెప్పారని, వైద్యం చేయించడానికి తమవద్ద డబ్బుల్లేవని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమతలేక కొడుకును ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. కళ్ల ముందే కుమారుడు మంచానికే పరిమితం కావడం.. రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడం చూసి తట్టుకోలేకపోతున్నారు. మరికొంతకాలం చికిత్స చేయిస్తే కుమారుడి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. తద్వారా తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు