డాక్టర్ల మెడపై కత్తి

9 Dec, 2019 11:16 IST|Sakshi
ఎంసీహెచ్‌ ఆస్పత్రి

సుఖప్రసవం పేరిట ఆలస్యం

కడుపులోనే మృత్యువాత

తల్లులకు కడుపుకోత

విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు

సాక్షి, జనగామ : మేడమ్‌ తట్టుకోలేకపోతున్నాం.. ఉమ్మనీరు పోతుంది.. సుఖప్రసవం అయ్యేట్టు లేదు.. ఆపరేషన్‌ చేయండి అంటూ గర్భిణి.. కుటుంబ సభ్యులు నెత్తినోరు మొత్తుకుంటున్నా డాక్టర్లు పట్టించుకోవడం లేదు. సుఖప్రసవం కోసమే ప్రయత్నిస్తున్నారు. మొదటి కాన్పులో ఆపరేషన్ల సంఖ్య తగ్గించాలి.. సుఖ ప్రసవాలు తప్ప.. సిజేరియన్లు ఉండకూడదంటూ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారులు హుకుం జారీ చేస్తుండడంతో డాక్టర్లు కక్కలేక మిగలేక అయోమయంలో పడిపోతున్నారు. దీంతో వైద్యులకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మొదటి కాన్పులో ఆపరేషన్‌ చేస్తే పై అధికారులకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందనే భయంతో నార్మల్‌కు ట్రయ్‌ చేస్తూ ఇరుకున పెడుతున్నారు. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చే గర్భిణులు ఒక్కోసారి ప్రసూతి కోసం రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తే నార్మల్‌ వరకు ఆగాల్సిందే లేదంటే తీసుకెళ్లండి అంటూ తెగేసి చెబుతుండడంతో చేసేది లేక అక్కడే ఉండిపోతున్నారు. దీంతో డెలివరీ అయ్యే వరకు కుటుంబ సభ్యులు ఊపిరి బిగపట్టుకుని దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు. 

ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ...
గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రులో మొదటి కాన్పు కోసం వచ్చే వారికి సుఖ ప్రసవం చేయాలని వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారుల ఆదేశాలు. ప్రతీ నెలా నార్మల్, ఆపరేషన్లపై సమీక్షలు నిర్వహిస్తూ సెక్షన్‌ రేటు ఎక్కువగా ఉన్న దవాఖానలకు సంబంధించిన బాస్‌లను సంజాయిషీ అడుగుతున్నారు. మొదటి కాన్పులో వందశాతం సుఖ ప్రసవాలు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితి చివరి స్టేజీ వరకు వేచి చూస్తుండడంతో తల్లులకు కడుపుకోత తప్పడం లేదు. నార్మల్‌ డెలివరీలను ఎవరూ తప్పుపట్టకున్నా కొన్ని సమయాల్లో ఆపరేషన్లు తప్పవు. సుఖప్రసవం కాదని తెలిసినా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాలని డాక్టర్ల వేచి చూసే ధోరణిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పాతకాలంలో సుఖ ప్రసవాలు కాలేదా అని వితండవాదం చేస్తున్న కొందరికి ఆస్పత్రికి వచ్చే గర్భిణుల కుటుంబ సభ్యులు దిమ్మదిరిగే సమాధానంచెబుతున్నారు. ఆహారంలో కల్తీ ముఫ్‌పై ఏళ్లు దాటకుండానే అనేక రోగాలు కష్టమంటే తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో సుఖ ప్రసవం అవడం చాలా కష్టమంటున్నారు.   

ఎంసీహెచ్‌లో కడుపుకోతలు..
చంపక్‌హిల్స్‌లోని జనగామ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో కడుపు కోతలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. సుఖ ప్రసవాలకు ప్రయత్నించే సమయంలో శిశువుల మరణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే కడుపు కోతలు తప్పడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపణలు చేస్తుండగా సుఖ ప్రసవం కోసం ప్రయత్నించడం తప్పు ఎలా అవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇరువురి ఆరోపణలు ఎలా ఉన్నా భావితరాలకు మార్గదర్శకులుగా తయారు కావాల్సిన శిశువులు లోకాన్ని చూడకుండానే అమ్మకడుపులో కన్ను మూస్తున్నారు.

ఎదురుచూడని కుటుంబాలు ప్రైవేట్‌ బాట
సుఖ ప్రసవం అంటూ కాలయాపన చేస్తుండడంతో కొందరు ప్రైవేట్‌ బాట పడుతున్నారు. పరిస్థితి విషమిస్తున్నా ఆపరేషన్‌ చేయలేని పరిస్థితుల్లో తమ బిడ్డలను ప్రైవేట్‌ దవాఖానలకు తీసుకెళ్తున్నారు. ప్రైవేట్‌కు వెళ్తున్న క్రమంలో డ్యూటీలో ఉన్న వైద్యులు వారిని ఆపలేకపోతున్నారు. ఎంసీహెచ్‌లో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ చివరి మాసం వరకు 2773 డెలివరీలు చేయగా జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 872 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఎంసీహెచ్‌లో 870 సుఖ ప్రసవాలు, 1903 ఆపరేషన్లు, ప్రైవేట్‌లో 833 ఆపరేషన్లు, 39 నార్మల్‌ డెలివరీలను చేసినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్‌ తెలిపారు. ఈ లెక్కన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రతీ నెలా సుమారు 80 ప్రసూతి కాన్పులు జరుగుతున్నాయి. ఇందులో 95 శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలే. ఎంసీహెచ్‌లో వేచి చూసే ధోరణి లేక నార్మల్‌ కోసం ప్రయత్నిస్తూ క్రిటికల్‌గా ఉన్నా ఆపరేషన్‌కు నిరాకరిస్తుండంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ బాటపడుతున్నారు. 

నూటికి 80శాతం నార్మల్‌ చేయాలి
వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ రూల్స్‌ ప్రకారం వందశాతంలో 80 నార్మల్, 20 శాతం ఆపరేషన్లు చేయాలి. క్రిటికల్‌గా ఉంటే ఆపరేషన్‌ చేయవచ్చు. ఇంటర్నేషల్‌ స్టాండెడ్‌కు అనుకూలంగా ఎంసీహెచ్‌లో గైనిక్‌ డాక్టర్, మత్తు, చిన్న పిల్లల వైద్యులతో పాటు ప్రసూతికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. మొదటి కాన్పులో సుఖ ప్రసవం అయ్యేట్టుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. డెలివరీ అయ్యే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అత్యవసర సమయంలో చాలా సార్లు ఆపరేషన్లు చేసి ఎంతో మందిని కాపాడాం.
– డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, ఎంసీహెచ్‌ ఆర్‌ఎంఓ, జనగామ

మరిన్ని వార్తలు