విద్యార్థులు 8 లక్షలు.. దరఖాస్తులు 9 వేలు  

5 Aug, 2019 03:04 IST|Sakshi

ముందస్తు ఉపకారానికి స్పందన కరువు

స్వీకరణ మొదలై నెలరోజులైనా వచ్చినవి 9,541

రెన్యువల్‌ విద్యార్థులు 8.02 లక్షల మంది

వచ్చేనెలాఖరుతో ముగియనున్న గడువు

డిసెంబర్‌ నాటికి సీనియర్లకు స్కాలర్‌షిప్‌ కష్టమే

సాక్షి, హైదరాబాద్‌: విద్యాసంవత్సరం మధ్యలోనే సీనియర్లకు ఉపకార వేతనం ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావించినా దరఖాస్తులు అంతంత మాత్రమే వచ్చాయి. దీంతో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ ప్రక్రియ జాప్యం కానుంది. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు ప్రక్రియ జూలై మొదటివారంలో ప్రారంభమైంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో తొలుత రెన్యువల్‌ విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించింది. ఈ పథకాల కింద ప్రతి సంవత్సరం 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో దాదాపు 5 లక్షల మంది ఫ్రెషర్స్‌ ఉంటారు. 2019–20 విద్యాసంవత్సరంలో 8,02,871 మంది సీనియర్‌ విద్యార్థులున్నట్లు సంక్షేమశాఖలు లెక్క తేల్చాయి.

దరఖాస్తులు తొమ్మిదిన్నరవేలే...
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సెప్టెంబర్‌ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. 3 నెలలపాటు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా, తొలి నెలన్నరలో రెన్యువల్, మిగతా నెలన్నరలో ఫ్రెషర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే సులభతరమవుతుందని సంక్షేమ శాఖలు భావించాయి. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 9,541 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఆగస్టు ఆఖరుకల్లా రెన్యువల్‌ విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తే సెప్టెంబర్‌ నుంచి వాటిని పరిశీలించి నవంబర్‌ కల్లా అర్హత నిర్ధారణ చేపట్టి డిసెంబర్‌లో ఉపకారవేతనాలు పంపిణీ చేయాలని సంక్షేమ శాఖలు ప్రణాళికలు తయారు చేసుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్‌ నాటికి స్కాలర్‌షిప్‌ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

అవగాహన కల్పించని కళాశాలలు
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల నమోదుపై కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించడం లేదు. విద్యార్థుల నుంచి కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు స్టడీ సర్టిఫికెట్లను యాజ మాన్యాలు తీసుకుని ఆన్‌లైన్లో వివరాలు నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి నుంచి వేలిముద్రలు తీసుకుని వెబ్‌సైట్లో అప్‌డేట్‌ చేసి ఫైలును సంక్షేమాధికారికి పంపాలి. అక్కడ వివరాలను సరిచూసిన తర్వాత అర్హతను నిర్ధారిస్తారు. యాజమాన్యాలు దరఖాస్తు గడువు తేదీని సైతం నోటీసు బోర్డుల్లో పెట్టడం లేదని సంక్షేమాధికారులు చెబుతున్నారు. నమోదుపై చైతన్యం కల్పిస్తేనే ఈ పథకాల అమలు సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు