టీఆర్‌ఎస్‌లో డీఎస్‌ ఒంటరి!

11 Oct, 2017 01:30 IST|Sakshi

పార్టీలో తగ్గిపోయిన ప్రాధాన్యం

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో లుకలుకలు

ఆయన వెంట వచ్చిన వారికి దక్కని పదవులు

కుమారుడు బీజేపీలో చేరడంతో వచ్చిన చిక్కు

డీఎస్‌ కూడా బయటపడాలని చూస్తున్నట్లు ప్రచారం  

సాక్షి, హైదరాబాద్‌: తన కుమారుడు తీసుకున్న ఓ నిర్ణయం సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) క్రియాశీల రాజకీయాలపై పడిందా..? సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న డీఎస్‌ను అధికార టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం తగ్గిపోవడం వెనుక ఈ అంశమే దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయనకు రాజ్యసభ స్థానం కూడా దక్కింది.

కానీ నిజామాబాద్‌ రాజకీయాల కారణంగా కొద్దిరోజుల్లోనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గడం మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డీఎస్‌ తనయుడు అరవింద్‌ బీజేపీలో చేరడం, అదీ నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇస్తామన్న హామీ తీసుకుని కాషాయ కండువా కప్పుకోవడంతో విషయం పెద్దదైందని చెబుతున్నారు. తన రాజకీయం, తన తనయుడి రాజకీయం వేర్వేరని.. తనకేం సంబంధం లేదని డీఎస్‌ తెలంగాణ భవన్‌ వేదికగా వివరణ ఇచ్చుకున్నా.. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వాన్ని సంతృప్తిపర్చ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థానికంగానూ పట్టని వైనం..
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో డీఎస్‌ ఒంటరి అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్‌ కేంద్రంగా టీఆర్‌ఎస్‌లో ఆయన ఉనికే ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. కాంగ్రెస్‌ను వీడి డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన కొందరు కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయిందని చెబుతున్నారు. స్థానిక అర్బన్, రూరల్‌ ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోవడం లేదని, పార్టీ పరంగా పదవులూ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.

మరోవైపు డీఎస్‌కు అధికారుల నుంచి సహకారం లభించడం లేదని, ఏ పనీ కావడం లేదని చెబుతున్నారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఉపాధిహామీ పథకానికి మ్యాచింగ్‌ గ్రాంటు ఇచ్చి ప్రతిపాదించిన పనులకు మండల పరిషత్‌లు సైతం ఆమోద తీర్మానాలు చేయడం లేదని సమాచారం. ఇక రాష్ట్ర స్థాయిలోనూ డీఎస్‌కు గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు.

డీఎస్‌తో సమ ఉజ్జీ అయిన మరో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు(కేకే)కు టీఆర్‌ఎస్‌లో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఆయన సంస్థాగతంగా మరోమారు సెక్రెటరీ జన రల్‌గా నియమితులు కావడం గమనార్హం.


ఎటువైపు చూపు?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్‌ తన రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఇటీవల సమాలోచనలు జరిపారన్న ప్రచారం జరిగింది. ఆయన తిరిగి కాంగ్రెస్‌కు వెళతారని కొన్ని వర్గాలు పేర్కొనగా.. డీఎస్‌ ఆ వార్తలను ఖండించారు. తాజాగా తన తనయుడి మాదిరిగా డీఎస్‌ సైతం బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి అరవింద్‌ బీజేపీలో చేరక ముందే డీఎస్‌ చేరికపై మంతనాలు జరిగాయన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికార టీఆర్‌ఎస్‌ నుంచి బలమైన ఒత్తిడి రావడంతో పార్టీ మారకుండా నిలిచిపోయారని తెలుస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల ముందైనా డీఎస్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. 

మరిన్ని వార్తలు