‘రెండు చక్రాల’తో బస్సు నడిచేనా! 

29 Apr, 2019 02:17 IST|Sakshi

పూర్తి స్థాయి ఎండీ లేరు.. 

ఆర్టీసీకి మిగిలింది ఇద్దరే ఈడీలు

రిటైర్‌మెంట్లు, పదోన్నతులకు ఎన్నికల కోడ్‌ అడ్డు

ఒక్కొక్కరికి నాలుగైదు అదనపు బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: పూర్తి స్థాయి ఎండీ లేక గందరగోళంగా తయారైన ఆర్టీసీలో, ఇప్పుడు కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)ల కొరతతో మరింత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు ఈడీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఈడీలతో కొనసాగుతోంది. ఇందులో ఏకంగా నాలుగు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈడీ రవీందర్‌ ఈనెలాఖరుకు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో ఇద్దరు ఈడీలే మిగలనున్నారు. రిటైర్‌ కాబోతున్న రవీందర్‌ నుంచి నాలుగు కీలక బాధ్యతలు వచ్చిపడుతుండటంతో ఉన్న ఇద్దరు ఈడీలకు వాటిని అప్పగించాల్సి వస్తోంది. దీంతో పూర్తిస్థాయి ఎండీ లేకపోవటం, ఇద్దరు ఈడీలతో ఆర్టీసీ నిర్వహించాల్సి రావటం ఇప్పుడు గందరగోళానికి కారణమవుతోంది.

తీవ్ర నష్టాలు, నిర్వహణలో సామర్థ్యం కొరవడటం, ఆదాయాన్ని పెంచే మార్గాలకు పదునుపెట్టే పరిస్థితి లేకపోవటం, ప్రభుత్వం నుంచి పెద్దగా ఆర్థిక సహాయం లేకపోవటం, బస్సుల కొరత, జీతాలకు డబ్బులు సరిపోకపోవటం, కొండలా పేరుకుపోతున్న అప్పులు, పాత బకాయిలు, తీవ్ర డ్రైవర్ల కొరత... ఇలాంటి స్థితిలో ఆర్టీసీని ఇద్దరు ఈడీలు నిర్వహించాల్సి రావటం పెద్ద సవాల్‌గా మారింది. పదోన్నతులు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. 

ఇన్‌చార్జిగా అప్పగించే యోచన 
ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఐటీ–రెవెన్యూ, కార్పొరేషన్‌ కార్యదర్శి బాధ్యతలను ఈడీలు పర్యవేక్షిస్తారు. వీటితోపాటు హైదరాబాద్‌ సిటీ జోన్, హైదరాబాద్‌ జోన్, కరీంనగర్‌ జోన్‌ బాధ్యతలూ పర్యవేక్షిస్తారు. వీటన్నింటిని ఇద్దరు ఈడీలు మోయటం కష్టం. పదోన్నతులకు ఎన్నికల కోడ్‌ అడ్డుగా ఉన్నందున, సీనియర్‌ అధికారులకు వీటిని అదనపు బాధ్యతలుగా అప్పగించే వీలుంది. ఈ విషయంలో ఇప్పుడు ఉద్యోగుల మధ్య మరోరకమైన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కార్పొరేషన్‌లో అస్తవ్యస్త పనులు జరుగుతున్నాయని, వాటికి కారణమైన ఓ అధికారి ఇప్పుడు సీనియర్లను కాదని, తనకు అనుకూలంగా ఉండే మరో అధికారికి ఆయా పనులు చూసే కీలక బాధ్యతను కట్టబెట్టేలా తెరవెనక చక్రం తిప్పుతున్నారని ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది.

సీనియర్లు ఉన్నందున ఆ అధికారికి కీలక బాధ్యతలు అప్పగించొద్దంటూ ఎండీ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోమవారం బాధ్యతల పంపకంపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే అత్యంత అస్తవ్యస్థంగా సంస్థ తయారైనందున, సమర్థులైన అధికారులకే బాధ్యత అప్పగించాలని, ఆరోపణలున్న వారికి బాధ్యతలు ఇవ్వవద్దని వారు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు