సున్నా మార్కుల ఉదంతంలో ఎగ్జామినర్‌పై వేటు

29 Apr, 2019 02:21 IST|Sakshi

పర్యవేక్షకుడిపై విచారణకు చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ రెండో సంవత్సరం తెలుగు పేపర్‌లో ఓ విద్యార్థినికి 99 మార్కులు రాగా సున్నా మార్కులు వేసిన ఉదంతంలో ఎగ్జామినర్, పర్యవేక్షకుడిపై వేటు పడింది. ఇటీవల విడుదలై తీవ్ర దుమారం లేపిన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో బాగా చర్చనీయాంశంగా మారిన వాటిల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వివరాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఆదివారం పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్‌ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన నవ్య అనే యువతికి తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. తాను పరీక్ష బాగా రాసినా, సున్నా మార్కులు రావటమేంటని ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.

పునర్‌మూల్యాంకనం చేయగా ఆమెకు 99 మార్కులు వచ్చాయి. దీనిపై బోర్డు అ«ధికారులు విచారణ జరిపారు. ఎగ్జామినర్‌ బబ్లింగ్‌ చేసే సమయంలో జరిగిన పొరపాటుగా తేల్చారు. ఎగ్జామినర్‌ ఉమాదేవి (తెలుగు అధ్యాపకురాలు) 99 మార్కులకుగాను 00గా నమోదు చేసినట్టు గుర్తించారు. దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తూ ఆమెకు రూ.5 వేల జరిమానా విధించగా ఆమె బోర్డుకు చెల్లించారు. శంషాబాద్‌ ఆర్‌బీనగర్‌లోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నందున ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ కొత్తూరు తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలుర జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎస్‌.విజయకుమార్‌ స్క్రూటినైజర్‌ హోదాలో ఉండి ఈ తప్పిదాన్ని గుర్తించలేదు. దీంతో ఆయనను కూడా బాధ్యుడిని చేస్తూ సస్పెండ్‌ చేసేందుకు, తదుపరి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు అశోక్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు