మోగిన మున్సిపల్‌ నగారా..! 

24 Dec, 2019 08:46 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల(అదిలాబాద్‌): ఊహిస్తున్నట్లుగానే మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. సరిగ్గా నెల రోజుల్లోగా ఎన్నికల తతంగమంతా పూర్తయ్యేలా సోమవారం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త సంవత్సరంలో మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలకు, కొమురంభీం జిల్లాలోని ఒక మున్సిపాల్టీకి కొత్త పాలకవర్గాలు రానున్నాయి. గతంలో మాదిరిగానే కోర్టు కేసుల కారణంగా మందమర్రిలో ఎన్నిక జరగడం లేదు. ఏడాదిన్నర క్రితం పురుడుపోసుకున్న నాలుగు మున్సిపాల్టీలు తొలి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. 

జనవరి 22న పోలింగ్‌
కొత్త సంవత్సరంలో మున్సిపల్‌ ఎన్నికల పాలకవర్గాలు కొలువుతీరనున్నాయి. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. 8న రిటర్నింగ్‌ అధికారులు స్థానికంగా ఎన్నికల నోటీసు ఇస్తారు. 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 25న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఏడాది జూలై 2వ తేదీన మున్సిపల్‌ పాలకవర్గం పదవీకాలం ముగియగా.. అప్పటినుంచి  ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. 

మంచిర్యాలలో ఆరు...కొమురంభీంలో ఒకటి
మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాల్టీలు ఉండగా.. మందమర్రిలో కోర్టు కేసుల కారణంగా ఇప్పటివరకు ఎన్నిక నిర్వహించడం లేదు. ఈ దఫా అయినా ఎన్నిక జరుగుతుందని పట్టణ వాసులు ఆశించినా, ఈ సారి నిరాశే ఎదురైంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట్, నస్పూరు, క్యాతన్‌పల్లి మున్సిపాల్టీల్లోని 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మంచిర్యాల, బెల్లంపల్లి పాత మున్సిపాల్టీలు. గత సంవత్సరం లక్సెట్టిపేట్, నస్పూరు, క్యాతన్‌పల్లి, చెన్నూరును కొత్తగా మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేశారు. కొమురంభీంఆసిఫాబాద్‌ జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాల్టీ కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

జనగణనపై రాని స్పష్టత
మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణనపై స్పష్టత రాలేదు. ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. కాని తాజాగా వార్డుల విభజన చేపట్టిన తరువాత, జనగణన చేపట్టలేదు. అయితే వార్డుల పునర్విభజనకు ముందు జనగణన చేపట్టడంతో కొత్త  వార్డులు పెద్దగా మార్పు లేకపోవడంతో ఒకటి, రెండు రోజుల్లో జనగణన పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆశావహుల దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. మరోవైపు వార్డుల తుది జాబితా రూపొందినా.. ఇంకా గెజిట్‌ మాత్రం విడుదల కాలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి వ్యక్తిగతంగా ఇప్పటికే సమాధానం పంపించారు. మళ్లీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించొద్దనే, వార్డుల విభజన, జనగణనపై అస్పష్టతను కొనసాగిస్తున్నారనే ప్రచారమూ ఉంది. అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా సోమవారం జారీ చేశారు. జనవరి 4వ తేదీన ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌         విడుదల కావడంతో రాజకీయ         పార్టీలు, ఆశావహుల్లో సందడి నెలకొంది.

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ఇదీ :

ఫొటో ఓటర్ల జాబితా ప్రదర్శన  డిసెంబర్‌ 30
అభ్యంతరాలు  డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2
రాజకీయ పార్టీలతో సమావేశం జనవరి 1
అభ్యంతరాల పరిష్కరణ జనవరి 3
ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా జనవరి 4 

మరిన్ని వార్తలు