కాటేసిన కరెంట్

17 May, 2015 23:21 IST|Sakshi

కరెంట్ షాక్‌తో పాలేరు దుర్మరణం
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా విద్యుదాఘాతం
పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో ఘటన
 

 
 పెద్దేముల్ : ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజు వేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో ఓ పాలేరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన అదివారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మగల్ల భాస్కర్ (35) మంబాపూర్ గ్రామ శివారులో తాండూరు ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి పాండు ఫాంహౌస్‌లో ఆరునెలలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం ఫాంహౌస్‌లో బోరుమోటార్ పనిచేయడం లేదు.

 ఈ విషయాన్ని భాస్కర్ తన యజమాని పాండు దృష్టికి తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం బోరు మెకానిక్ వస్తాడు...నీవు అక్కడే ఉండాలని చూసుకో.. అని యాజమాని భాస్కర్‌కు సూచించాడు. దీంతో ఆయన బోరుమోటార్ వద్ద గడ్డి, ముళ్లకంపలు శుభ్రం చేశాడు. అనంతరం పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించి ఫ్యూజు పోయిందని గుర్తించాడు. ఫ్యూజ్ పోవడంతోనే బోరుమోటర్ పనిచేయడం లేదేమోనని భావించాడు భాస్కర్. ఫ్యూజ్ వేస్తే బోరుమోటార్ నడుస్తుండొచ్చనుకున్నాడు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెపైకి ఎక్కి ఫ్యూజు వేసే యత్నం చేశాడు.

అయితే అదే విద్యుత్ స్తంభానికి మంబాపూర్ గ్రామానికి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్ లైన్ కూడా ఉంది. దానిని భాస్కర్ గమనించకపోవడంతో ఫ్యూజులు వేస్తుండగా పైన ఉన్న తీగలు భాస్కర్ తలకు తగలడంతో విద్యుదాఘాతమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభంపైనే తీగలపై ఆయన మృతదేహం వేలాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన పక్కపొలం రైతులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫాంహౌస్ యజమాని, మంబాపూర్ గ్రామస్తులు ఘటనా స్థలానికి పెద్దఎత్తున చేరుకున్నారు. భాస్కర్ మృతికి మీరే బాధ్యులంటూ ఫాంహౌస్ యజమాని పాండును నిలదీసి దూషించసాగారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పెద్దేముల్ ఎస్‌ఐ రమేష్, విద్యుత్ ఏఈ మైపాల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు అయిన భాస్కర్ మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

మరిన్ని వార్తలు