రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!

21 Jul, 2015 23:56 IST|Sakshi
రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!

- ఎలివేటెడ్ కారిడార్‌లకు 250 ఎకరాలు అవసరం
- రక్షణశాఖ పరిధిలో 75 ఎకరాలు
- భూసేకరణపై దృష్టి సారించిన సర్కార్
- ఆకాశమార్గాలపై తుది దశకు చేరిన అధ్యయనం
- త్వరలో సమగ్ర నివేదిక
సాక్షి, సిటీబ్యూరో:
ఆకాశ మార్గాలపై అధ్యయనం తుది దశకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా కేంద్రాలకు మధ్య దూరభారాన్ని తగ్గించే లక్ష్యంతో మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వరకు, బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్  ఔటర్ రింగురోడ్డు వరకు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్‌కేసర్ ఔటర్ రింగురోడ్డు మార్గాల్లో ఆకాశ రహదారులను నిర్మిస్తారు. ప్యారడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాలను ఆర్‌వీ అసోసియేట్స్ అధ్యయనం చేస్తుండగా, ఉప్పల్- ఘట్‌కేసర్ మార్గాన్ని తాజాగా వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు.

ఈ మూడు మార్గాల్లో సదరు కన్సెల్టెన్సీలు సమగ్రమైన నివేదికలు అందజేయవలసి ఉంది. అయితే గత ఏప్రిల్‌లోనే అధ్యయనం ప్రారంభించిన ఆర్‌వీ అసోసియేట్స్ ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల్లో  త్వరలో తుది నివేదికను అందజేసే పనిలో ఉంది. ఆ సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు 250 ఎకరాల  భూమి అవసరం. 20 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో 150 ఎకరాలు, 18 కిలోమీటర్ల నర్సాపూర్ ఎలివేటెడ్ మార్గంలో 100 ఎకరాలు సేకరించవలసి ఉంది. శామీర్‌పేట్ మార్గంలో 75 ఎకరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ  రక్షణశాఖ పరిధిలో ఉన్న మరో 75 ఎకరాల భూసేకరణ ఇబ్బందిగా మారింది. రక్షణశాఖ నుంచి అనుమతి లభిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.
 
కేంద్రానికి లేఖ రాసిన సర్కార్
బాలానగర్-నర్సాపూర్ మార్గంలో  భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మార్గంలోని వంద ఎకరాల  కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెవిన్యూ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు జాతీయ రహదారుల సంస్థ దృష్టి సారించింది. శామీర్‌పేట్ మార్గంలో సేకరించవలసిన 75 ఎకరాల రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు. ‘ప్రభుత్వం మరింత గట్టిగా చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తప్ప ఈ మార్గంలో భూ సేకరణ సాధ్యం కాదు. అదంతా ఒక కొలిక్కి వ స్తే తప్ప పనులు ప్రారంభం కాబోవు.’ అని నేషనల్ హైవేస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
 
ఆరు లైన్‌ల ఫ్లైఓవర్...

సుమారు రూ.1600 కోట్లతో నిర్మించతలపెట్టిన శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో రోడ్డు మార్గాన్ని 4 లైన్‌లకు విస్తరిస్తారు. ఆకాశమార్గంలో 6 లైన్‌ల రహదారులు నిర్మిస్తారు. దీంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సాగిపోతాయి. బాలానగర్-నర్సా పూర్, ఉప్పల్ - ఘట్‌కేసర్ మార్గాల్లోనూ 10 నుంచి 14 కిలోమీటర్‌ల వరకు ఎలివేటెడ్ మార్గాలు నిర్మితమవుతాయి. దీనివల్ల  వాహనాల ఫ్రీ ఫ్లో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో ప్రతి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.  ఎన్‌హెచ్-202 మార్గంలో ఉన్న ఉప్పల్- ఘట్‌కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు కేవలం  గంటన్నర వ్యవధిలో చేరుకొంటే అక్కడి నుంచి ఉప్పల్ రింగురోడ్డుకు వచ్చేందుకే మరో గంటన్నరకు పైగా సమయం పడుతుంది.
 
ఉప్పల్-ఘట్‌కేసర్‌పై తాజా అధ్యయనం
ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనం ఆర్‌వీ అసోసియేట్స్ చేపట్టగా  ఉప్పల్- ఘట్‌కేసర్ మార్గం ప్రాజెక్టును వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. 20 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే నిర్మించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు