‘కరోనా చర్యలపై కేంద్రమంత్రి అభినందించారు’

6 Mar, 2020 20:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19)ను నియంత్రించే చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పడిన ఐదు కమిటీల విధివిధానాలపై చర్చించామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా మన దేశంలో విమానయానం చేసే వారికి కూడా ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్‌ 95 మాస్కుల కొరత ఉందని, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే వారికి ఈ మాస్క్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని మంత్రి ఈటల చెప్పారు. ఆ వివరాలను వెల్లడించారు.

‘తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలన్నిటినీ పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గాంధీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌కు అనుగుణంగా మరొక ల్యాబ్ ఇవ్వాలని కోరాం. సోషల్ మీడియాలో బాద్యతా రహితంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు హాజరు కావొచ్చు. మాస్కుల లభ్యతపై కమిటీ వేశాం. ఎక్కువ ధరలకు మాస్కులు అమ్ముతున్న దుకాణాదారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇవాళ రాత్రి గాంధీ ఐసోలేషన్ వార్డు సందర్శిస్తాం. ఇటలీ నుంచి వచ్చిన వరంగల్ వ్యక్తితో పాటు నిన్న ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు టెస్టులు చేశాం. ఆ రిపోర్టులు రేపు వస్తాయి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు