కరోనా కేసులు నమోదు కాలేదు: మంత్రి ఈటల

29 Jan, 2020 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో బుధవారం మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..  చైనా నుంచి వచ్చిన వారి అనుమానితుల రక్త నమూనాలు పూణెకు పంపించామని అన్నారు. రాష్ట్రంలో కొత్త వైరస్‌ కొంత ఆందోళన కలిగిస్తుందని, కరోనా కూడా స్వైన్‌ ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రుల్లో ఐసోలేటేడ్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా టెస్ట్‌లు నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. కరోనా అనుమానితుల కోసం హైదరాబాద్‌లో వంద పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు భయపడవద్దని, అధికారులతో మాట్లాడి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ వైరస్‌పై వార్తలు ఇవ్వాలని విలేకరులకు సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ విస్తరించే అవకాశం లేదన్నారు. (ఒక్క మంత్రంతో కరోనా వైరస్‌ మాయం..!)

అదే విధంగా మేడారం జాతరలో ప్రజలకు సమీపంలోని ఆస్పత్రుల్లో హై అలర్ట్‌ జారీ చేశామని మంత్రి తెలిపారు. ఆరుగురు డీఎం, హెచ్‌ఓలను, అలాగే 13 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. ఇప్పటి వరకు అయిదుగురి పేషెంట్ల రక్త నమూనాలు తీసుకున్నామని, వారిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ సోకకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంత కుమారి, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఫీవర్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ శంకర్‌, ఆయుష్‌ డైరెక్టర్‌ అలుగు వర్శిని పాల్గొన్నారు. (కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం)

కాగా ప్రాంణాంతక వైరస్‌ కరోనా చైనాలో ఉధృతంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 131 మంది చైనాలో మృత్యువాత పడ్డారు. ఈ వైరస్‌ భారత్‌ను కూడా వణికిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

చదవండి : చైనాలో 131కి పెరిగిన మృతుల సంఖ్య

'ఆ పిశాచి ఎక్కడ దాక్కున్నా వదలం'

ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!

మరిన్ని వార్తలు