మద్యం చుక్క దొరికినా కేసులే..!

16 Nov, 2018 09:26 IST|Sakshi
పట్టుబడిన మద్యంతో ఎక్సైజ్‌ పోలీసులు (ఫైల్‌) 

కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతులు..

24 గంటల పాటు పోలీసుల నిఘా

ఉన్నతాధికారులు రోజువారీ తనిఖీలు..

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం : ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ప్రవాహం సాధారణమైపోయింది. అయితే, ఈసారి మద్యం ప్రవాహాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే భావనతో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాను ఆనుకుని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉండడంతో అక్కడి నుంచి భారీగా మద్యం అక్రమంగా జిల్లాకు సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అధికారులకు అందింది. దీం తో సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు నిఘా ఏర్పాటుచేసి చుక్క మద్యం కూడా సరిహద్దు దాటకుండా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా, పర్యవేక్షణ సరిహద్దు వెంట ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లో 24గంటల పాటు నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక నిఘా, పర్యవేక్షక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి విధులు అప్పగించారు.

ఒక్కో బృందానికి ఒక్కో చెక్‌పోస్టు బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు రోజువారీ తనిఖీలు, పరిశీలించిన వాహనాలు, స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా రెండు వాహనాల ద్వారా మొబైల్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటికి తోడు జిల్లాలోని మద్యం దుకాణాలపై నిఘా ఏర్పాటు చేసి రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సరిహద్దుల వెంట మొబెల్‌ పార్టీల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. 


బెల్ట్‌ దుకాణాలు, నాటుసారా 
మద్యం దుకాణాలకు తోడు జిల్లాలో ఎక్కడ కూడా బెల్ట్‌ షాపులు నిర్వహించకుండా అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గతం లో మద్యం అమ్మిన షాపులను గుర్తించి మరోసారి తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా మద్యం స్వాధీనం చేసు కుని నిర్వాహకులను బైండోవర్‌ చేస్తున్నారు. అంతేకాకుండా నాటుసారా తయారీ, అమ్మకంపై కూడా దృష్టి సారించారు.

తయారీదారులకు బెల్లం, పటిక అందకుండా పకడ్బండీ చర్యలు చేపట్టారు. వీటికి తోడు తరచు చేపడుతున్న తనిఖీల్లో నాటుసారా స్వాధీనం అవుతోంది. కాగా, తనిఖీల కోసం ఐదు రకాల బృందాలను ఏర్పాటుచేసి ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు రోజువా రీ పరిశీలన చేపడుతుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. 


సెప్టెంబర్‌ 1నుంచి నమోదైన కేసులు 
ఎన్నికలు రానున్నాయన్న సమాచారంతో జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 217 సారా తయారీ కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 209మందిని అరెస్టు చేశారు. అలాగే, 1,922లీటర్ల సారాతో పాటు 5,210 కేజీల బెల్లాన్ని సీజ్‌ చేశారు. దీంతో పాటు పలు కేసుల్లో ఎక్సైజ్‌ అధికారులు 18వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్‌ చేశారు.

అదేవిధంగా కల్తీ కల్లు కేసులు 89నమోదు చేయగా దీంట్లో 11,476 లీటర్ల కల్లును సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా గ్రామాల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న బెల్టు దుకాణాలపై 299కేసులు నమోదు చేసి 291 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐఎంఎల్‌ 13వేల లీటర్లు, 2,400 లీటర్ల బీర్‌ను సీజ్‌ చేశారు. ఆయా బెల్టు దుకాణాల్లో 10వాహనాలు సీజ్‌ చేశారు. ఇవన్నీ కాకుండా అక్రమ మద్యం, గుడుంబా కేసుల్లో 497మంది అనుమానితులను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్‌ చేయించినట్లు వెల్లడించారు.

 
కేసులు, సీజ్‌ చేసిన మద్యం 
నాటుసారా తయారీ కేసులు    217 
స్వాధీనం చేసుకున్న సారా    1,922 లీటర్లు 
సీజ్‌ చేసిన బెల్లం    5,210 కేజీలు 
సీజ్‌ చేసిన కల్లు    11,476 లీటర్లు 
ఐఎంఎల్‌    13,000 లీటర్లు 
బీర్‌    2,400 లీటర్లు

తనిఖీ బృందాలు ఇవే...
- సరిహద్దు చెక్‌పోస్టు బృందాలు 
- మొబైల్‌ బృందాలు 
- జిల్లా టాస్క్‌ఫోర్సు బృందం 
- స్టేషన్ల వారీగా బృందాలు 
- సమాచార సేకరణ బృందాలు  


తనిఖీలు ముమ్మరం చేశాం 
ఎన్నికల సందర్భంగా మద్యం పంపకాలు, అక్రమ తరలింపు జరగకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసు కుంటున్నాం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రతీ అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తాం. మద్యం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా పూర్తి నిఘా పెట్టాం. పోలీసులతో పాటు ఇతర శాఖలతో కలిసి సంయుక్తంగా నివారణ చర్యలు చేపట్టాం.

చెక్‌పోస్టుల వద్ద నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్నాం. అయితే, ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు, తరలింపు, నాటుసారా తయారీ, అమ్మకాల సమాచారం తెలిసిన వారు మాకు తెలియజేయాలని. వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– జయసేనారెడ్డి, డీసీ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా  

మరిన్ని వార్తలు