టెలీమెట్రీలపై కదలిక!

30 Dec, 2017 01:07 IST|Sakshi

పోతిరెడ్డిపాడు పరిధిలో నిపుణుల బృందాల పర్యటన 

గోదావరి బోర్డు పరిధిలోనూ టెలీమెట్రీల ఏర్పాటుపై కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఏర్పాటు చేస్తున్న టెలీమెట్రీలపై ఎట్టకేలకు కృష్ణాబోర్డులో కదలిక వచ్చింది. టెలీమెట్రీ వ్యవస్థను కార్యాచరణలోకి తీసుకురావడంలో జాప్యంపై తెలంగాణ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాటిని అమల్లోకి తెచ్చే దిశగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏర్పాటుచేసిన టెలీమెట్రీ ప్రాంతాల్లో వాటి పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయిస్తోంది. బుధవారం సోమర్‌ కంపెనీకి చెందిన నిపుణులు, బోర్డు సభ్యులు పోతిరెడ్డిపాడు ప్రాంతంలో పర్యటించి టెలీమెట్రీల పనితీరును పరిశీలించారు.

వాస్తవానికి మొదటి విడతలో 18 చోట్ల టెలీమెట్రీల ఏర్పాటు ఈ ఏడాది మే నాటికే పూర్తయినా కార్యరూపంలోకి రాలేదు. దీంతో ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగం ఇంకా మాన్యువల్‌గానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పోతిరెడ్డిపాడు కింది వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన టెలీమెట్రీని ట్యాంపరింగ్‌ చేసి లెక్కలు తారుమారు చేశారని గత బోర్డు సమావేశంలో తెలంగాణ ఫిర్యాదు చేసింది. అయితే టెలీమెట్రీలు అధికారికంగా అమల్లోకి రానందున ట్యాంపరింగ్‌ అవకాశం లేదని బోర్డు వివరణ ఇచ్చింది. అయినా కూడా కేంద్ర జల వనరుల శాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీనిపై టెలీమెట్రీ వ్యవస్థలో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులతో పరిశీలన మొదలు పెట్టింది. శుక్రవారం వీరు పోతిరెడ్డిపాడు కింద పర్యటించి ప్రవాహ లెక్కలను పరిశీలించారు. శనివారం శ్రీశైలం, అనంతరం నాగార్జునసాగర్, జూరాల పరిధిలో పర్యటించనున్నారు.  

గోదావరిపై త్రిసభ్య కమిటీ.. 
గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల పరిధిలో సైతం టెలీమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాంతాలను నిర్ధారించేందుకు గోదావరి బోర్డు కమిటీ ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారులు ఇద్దరు, బోర్డు నుంచి ఒకరు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. 

మరిన్ని వార్తలు