స్టాక్స్‌... అలుపులేని పరుగు

30 Dec, 2017 01:05 IST|Sakshi

2017... నిస్సందేహంగా బుల్స్‌దే. ఎందుకంటే ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు బేర్స్‌ గుప్పెట్లో విలవిలలాడిన సందర్భాలేవీ దాదాపు లేవు. బుల్స్‌ మాత్రం బుసలు కొడుతూ మార్కెట్‌ను కొత్త కొత్త శిఖరాలకు తీసుకెళ్లిపోయారు. చిత్రమేంటంటే... ఈ ఏడాదికి ఆఖరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం కూడా మార్కెట్లు సరికొత్త గరిష్ఠ స్థాయుల వద్ద... అంటే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10.500 పాయింట్లపైన... బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34వేల పాయింట్ల పైన ముగిశాయి. మొత్తమ్మీద ఏడాదిలో సెన్సెక్స్‌ 28 శాతం (7,431 పాయింట్లు) నిఫ్టీ 29 శాతం లాభపడ్డాయి.


జులై నుంచి జీఎస్‌టీ అమల్లోకి రావటంతో పన్ను వసూళ్లు తగ్గుతాయనే అంచనాలు కొంత గందరగోళానికి తావిచ్చాయి. ఇది కంపెనీల రెండవ, మూడవ త్రైమాసికాల ఫలితాలపైనా ప్రభావం చూపిం చింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం... ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచుతుండటం వంటివి కొంత ప్రతికూలత చూపినా... దేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులన్నిటినీ మార్కెట్లలోకే మళ్లించటంతో సూచీల జోరు కొనసాగించింది.

దీనికి తోడు ప్రపంచబ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ స్థానం ఎకాఎకిన 30 స్థానాలు  మెరుగుపడి 100వ ర్యాంకుకు చేరడం మూడీస్‌ సావరిన్‌ రేటింగ్‌ పెంపు వంటి అంశాలు మన మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి.  నిజానికి దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి మళ్లించారని చెప్పటం కంటే... ఇతరత్రా ఎక్కడా రాబడికి మంచి అవకాశాలు లేకుండా పోవటం వల్ల మళ్లించాల్సి వచ్చిందని చెప్పటం కరెక్టు.

ఈ ఏడాది మొత్తమ్మీద విదేశీ ఇన్వెస్టర్లు రూ.52,000 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు పెట్టగా... దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.లక్ష కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి. లోహ, వాహన, టెలికం, బ్యాంకింగ్, క్యాపిటల్‌ గూడ్స్, రియల్టీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ఐటీ అంతంత మాత్రంగా రాణించగా, ఫార్మా షేర్లు దెబ్బతిన్నాయి. ఎన్‌పీఏలతో సతమతమవుతున్న బ్యాంకులకు ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వటంతో ఆ షేర్లూ రయ్యిమన్నాయి. ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూలు విజృంభించాయి. 167 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.68,810 కోట్లు సమీకరించాయి. గత ఐదేళ్లుగా ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తం కంటే ఇది అధికం!!.

ఆల్‌టైమ్‌ హైకి సూచీలు...
సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ సూచీలూ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 48%, స్మాల్‌క్యాప్‌ సూచీలు 60% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఈ ఏడాది రూ.45.39 లక్షల కోట్లు పెరిగి రూ.152 లక్షల కోట్లకు ఎగసింది.

బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, బీఎస్‌ఈ 500 సూచీల్లోని మొత్తం 227 షేర్లు 1455% లాభాన్ని కళ్లజూశాయి. హెచ్‌ఈజీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్, గ్రాఫైట్‌ ఇండియా, వెంకీస్, రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు వెయ్యి శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండియాబుల్స్‌ హౌసింగ్, మారుతీ, హిందాల్కో, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ షేర్లు 80–110% రేంజ్‌లో పెరిగాయి.

>
మరిన్ని వార్తలు