రాజీవ్‌శర్మ సర్వీస్‌ను పొడిగించండి

17 Feb, 2016 04:04 IST|Sakshi
రాజీవ్‌శర్మ సర్వీస్‌ను పొడిగించండి

మరో ఆరు నెలలు అనుమతించండి
ప్రధానికి లేఖ ఇచ్చిన సీఎం కేసీఆర్
మే నెలతో ముగియనున్న పదవీకాలం

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఓ లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందజేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ కాలం మే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును ఆరు నెలలు పెంచాలని సీఎం ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే సందర్భంలోనే ఈ లేఖను అందించారు. నిబంధనల ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు గడువు పెంచాలంటే మూడు నెలల ముందు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏఐఎస్ పెన్షన్ రూల్స్ సెక్షన్ 16 ప్రకారం సదరు అధికారికి ఆరు నెలల వరకు గడువు పొడిగించవచ్చు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులైతే సర్వీసు కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్రంతోనే సంప్రదింపులు జరిపితే డీవోపీటీ సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలలకు మాత్రమే పెంచే అవకాశముంది. అందుకే సీఎం ఈ లేఖను నేరుగా ప్రధానికి ఇచ్చి ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉన్న దృష్ట్యా ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ 2 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాజీవ్‌శర్మ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. కేంద్ర హోంశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పని చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఏడాది మే 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుంది. ఆరు నెలల పాటు పొడిగిస్తే నవంబర్ నెలాఖరు వరకు ఆయనే తెలంగాణ సీఎస్‌కు కొనసాగుతారు.

మరిన్ని వార్తలు