నాసిరకం మందులకు రాజముద్ర!

15 Jun, 2015 02:40 IST|Sakshi
నాసిరకం మందులకు రాజముద్ర!

 టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో అవినీతి తాండవం
  కమీషన్లు ఇస్తే నాణ్యతా ప్రమాణాలు లేకున్నా ఆమోదం
  ముడుపులివ్వకుంటే మంచి మందులైనా కొర్రీలు
  అనాలసిస్ విభాగంలో కొందరు ఫార్మసిస్ట్‌ల ఇష్టారాజ్యం
  పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

 

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లో అవినీతి తాండవిస్తోంది! అక్రమార్కుల ధన దాహానికి మందుల నాణ్యత గాలికి కొట్టుకుపోతోంది!! సంస్థలోని అనాలసిస్ వింగ్ (నాణ్యతా ప్రమాణాలు పరీక్షించే విభాగం)లో కొందరు ఫార్మసిస్ట్‌లు ముడుపులిస్తే నాసిరకం మందులకు రాజముద్ర వేస్తూ ముడుపులివ్వకుంటే మంచి మందులైనా అంగీకరించడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల అండ చూసుకొని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి మందులు, సర్జికల్స్ తదితరాలు సరఫరా చేసే సప్లయర్లు నాసిరకం మందులు సరఫరా చేస్తున్నారు.
 
  నిబంధనల ప్రకారమైతే 220 రకాల మందులతోపాటు కొన్ని సర్జికల్ వస్తువులకు అనాలసిస్ వింగ్‌లో నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి ఆమోదం తెలపాల్సి ఉంది. వీటికి సంబంధించిన నమూనాలను ఔషధ నియంత్రణ మండలి ల్యాబొరేటరీతోపాటు, హైదరాబాద్‌లోని మరో రెండు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ ల్యాబొరేటరీలు ఇచ్చే నివేదికలపై అనాలసిస్ వింగ్‌లోని వారికే మొదట సమాచారం అందుతోంది. దీంతో వారు ఈ నివేదిక ఆధారంగా సప్లయర్లకు సమాచారమిస్తున్నారు. ఒకవేళ మందులు నాసిరకం అని తేలితే.. వెంటనే ల్యాబొరేటరీలు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి, మరో కొత్త బ్యాచ్ మందులను ల్యాబొరేటరీలకు పంపి సరిచేస్తున్నారు.
 
  ముడుపులు ఇవ్వకుంటే నాసిరకం అని తేలకపోయినా సరిగా లేవని ఫిర్యాదులు పంపి వాటిని పక్కన పెడుతున్నారు. తాజాగా తెలంగాణలో 15 రకాల మందులు నాసిరకం అని ఔషధ నియంత్రణశాఖ తేల్చింది. అయితే నాసిరకం అని తేలాక కూడా వాటిని వెనక్కు తీసుకురాకుండా రోగులకు ఇస్తున్నారు. ఈ తతంగం వెనక టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అనాలసిస్ వింగ్‌లో పనిచేస్తున్న ఒక ఫార్మసిస్ట్ చక్రం తిప్పుతున్నట్టు తెలిసింది. ఇటీవలే ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమితులైన అధికారి కూడా వీటిని అరికట్టలేని పరిస్థితి నెలకొంది. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ప్రస్తుతానికి సురేశ్ చందానే కొనసాగుతుండగా ఆయన సమయం కేటాయించకపోవడంతో అక్రమాల బాగోతం నియంత్రణలోకి రావట్లేదు.
 
 బ్లాక్‌లిస్టులో ఉన్నవి కొన్నే!
 రాష్ట్రంలో బ్లాక్‌లిస్టులో ఉన్న నాసిరకం మందులు మచ్చుకు కొన్ని మాత్రమేనని తెలుస్తోంది. అనాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్‌ల సాయంతో మందుల బ్యాచ్‌లు మార్చి తిరిగి ల్యాబొరేటరీలకు పంపించడం, మంచివని తేల్చి మళ్లీ మార్కెట్లోకి పంపించడం రివాజుగా మారింది. ఈ సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు సైతం పలుసార్లు ఇలాంటి కమీషన్ల బాగోతం బయటపడినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల సంస్థలో ఇలాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
 

మరిన్ని వార్తలు