బాధితులుగా మారుతున్న అత్తలు

21 Jul, 2018 12:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏళ్లనాటి పెత్తనానికి చెక్‌..!

కఠిన చట్టాలను అనుకూలంగా

మార్చుకుంటున్న వైనం

వెనుకేసుకస్తున్న కొడుకులు

ఆర్డీఓ కోర్టుకు పెరుగుతున్న కేసులు

తెలుగు సినిమాలు, సీరియల్స్‌ ప్రభావం అనుబంధాలపై తీవ్రంగా పడుతోంది. ఒకప్పుడు కోడలు అంటే బానిస అని.. పనిచేయడానికే వచ్చిందని భావించి అత్తలు పెత్తనం చెలాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులకు కాలం చెల్లింది. పెత్తనాన్ని సహించేందుకు ఇప్పటి కోడళ్లు సిద్ధంగా లేరు. చట్టాలు కావచ్చు.. మారిన ఆర్థిక పరిస్థితులు, సమాజంలో వస్తున్న మార్పు ఇందుకు కారణం కావచ్చు.

ఒకప్పుడు అత్త చేతిలో తన్నులు తిని ఆడబిడ్డపై ఫిర్యాదు చేస్తూ తన సంసారాన్ని కాపాడాలని కోడళ్ల బాధలు పోలీస్‌స్టేషన్లలో వినబడేవి. ఇప్పుడు నిశితంగా గమనిస్తే కోడలు కూడు పెట్టడం లేదని, కొడుకు కూడా ఆమె మాటే వింటున్నాడని ఆస్తులన్నీ లాక్కున్నారని నగరం నుంచి మొదలు మండల స్థాయి పోలీస్‌స్టేషన్‌లలో వారానికి ఒక ఫిర్యాదైన అందుతోంది. ప్రభుత్వం ఇటువంటి కేసుల కోసం ఆర్డీఓ కోర్టులను ఏర్పా టు చేసింది.

మన జిల్లాలో వందకు పైగా ఫిర్యాదులు ఈ కోర్టులోకి వచ్చాయి. అంటే పరిస్థితి ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మహిళా సంఘాల బాధ్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు అత్తల బాధితుల తరఫున పోరాడేవారమని, ప్రస్తుతం పరిస్థితి మారి కోడళ్ల బాధితుల తరఫున కౌన్సిలింగ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. దీనికి వారు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇలా ఉన్నాయి.

చెన్నారావుపేట వరంగల్‌ :   ఒకప్పుడు ఇంట్లో అత్త పెత్తనం సాగేది. అత్త అంటేనే కోడలుకు వణుకు..! ఇప్పుడు సీన్‌ రివర్సయింది. వచ్చిన చట్టాలు కావచ్చు.. మారిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు.. గత ఐదేళ్లలో చాలా మార్పు వచ్చింది. అత్త పెత్తనానికి చెక్‌ పడింది.  ఇటీవల కాలంలో కోడళ్ల ప్రవర్తన ఆశ్చర్యానికి తావిస్తోంది.

దీనికి సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా తోడవుతోంది. టీవీ సీరియల్స్‌లో కేవలం అత్తలను విలన్లుగా చూపించడంతో బాధితులుగా మారుతున్న వారి ఉదాంతాలు వెలుగులోకి రావడం లేదని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. కోడళ్లు కూడా బాధ్యతగా ఉంటేనే భారతీయ సంస్కృతికి వారసులమవుతామని గుర్తించాలి.  ప్రేమ, ఆప్యాయతలు తగ్గాయి..
అప్పటి రోజులకు, ఇప్పటి రోజులకు చాలా వ్యత్యాసం ఉంది.

ప్రేమ, అప్యాయతులు చాలా  తగ్గాయి. అత్తాకోడళ్ల మధ్య ఆప్యాయతలు పెరగాలంటే ముందుగా సహనం కలిగి ఉండాలి. చెప్పే మాటలు ఓపిగ్గా విని అర్థం చేసుకున్నప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ మీడియా ప్రభావం, సెల్‌ఫోన్, సీరియల్స్, ఉద్యోగ బాధ్యతలు తదితర కారణాలతో  కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.

ఓపిక లేక కుటుంబ కలహాలకు దారి తీస్తుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వారి కోసం వరంగల్‌లో వన్‌స్టాప్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అందులో లీగల్‌ కౌన్సిలర్, సోషల్‌ కౌన్సిలర్, మెడికల్‌ సఫోర్ట్, ఆర్థిక సాయం, తాత్కాలిక నివాసం లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 170 కేసులు రాగా  అందులో సుమారుగా 80 వరకు పరిష్కారమయ్యాయి.

 - సబిత, జిల్లా సంక్షేమ అధికారి

సీన్‌ రివర్స్‌..

ఇక్కడ కొడుకుల ప్రమేయం ఉంది. ఒకప్పుడు తల్లులకు మద్దతుగా నిలిచిన కొందరు కొడుకులు.. ఇప్పుడు భార్యలకు మద్దతు పలుకుతున్నారు. కారణం చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, నేను, నా భార్య, నా పిల్లలు అనే భావనకు వచ్చారు. దీంతో భార్య చూస్తే సరే.. లేదంటే వృద్ధాశ్రమానికి తల్లిదండ్రులను పంపుతున్నారు. భార్యకు నచ్చ చెప్పుకుని కన్నవారిని బాగా చూసుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల పోలీస్‌స్టేషన్‌ బాట పడుతున్న అత్తలు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.

మితిమీరిన పెత్తనమే కారణం..

సమాజంలో చాలా మంది సంతోషంగా బతుకుతుంటే తాము మాత్రం ఎందుకిలా బానిసలుగా బతుకలన్నా ధోరణీ కోడళ్లలో పెరిగి తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీస్‌స్టేషన్లలో పెరుగుతున్న ఫిర్యాదులే సాక్ష్యం.  అత్తల మితిమీరిన పెత్తనం వారి బతుకులను రోడ్డున వేయడమే కాకుండా కుటుంబాల పరువును కూడా తీస్తుంది.

అత్త చెప్పిందల్లా వినాలనే పరిస్థితి ఇప్పుడు లేదు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ప్రతి మహిళా తన భర్తతో సొంతోషంగా గడపాలని, పిల్లలకు నచ్చిన వాటిని అందించాలని, వారి కోర్కెలను తీర్చాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో అత్తలు సహకరించకపోతే తిరుగుబాటుకే కాదు హత్యలకు కూడా వెనుకాడటం లేదు.

మార్పులు తెచ్చిన చట్టం..

కోడళ్ల తరుపున కేంద్ర ప్రభుత్వం గృహ హింస చట్టం తెచ్చింది. దశాబ్దకాలానికి పైగా వచ్చిన ఈ చట్టం ఊహించని మార్పులు తెచ్చింది. అప్పటి వరకు పెత్తనం చెలాయించిన అత్తలు ఈ చట్టం దెబ్బకు నోళ్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ కారణం చేతనైన ఇంటి కోడలు అత్తింటి వారిపై వరకట్నం పేరుతో వేధించినా, ఏ ఇతర కారణమై  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. అత్త, మామ, ఆడపడుచూతో సంబంధికులను అరెస్ట్‌ చేస్తున్నారు.

బెయిల్‌ కూడా రాకుండా కఠినంగా చట్టం అమలు చేయడంతో  పరిస్థితి ఈ విధంగా వచ్చింది. ఏమంటే కోడలు ఎక్కడ ఫిర్యాదు చేస్తుందోనని నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ఈ క్రమంలో కోడలు తప్పులు ఉన్న చెప్పుకోలేని పరిస్థితిల్లో అత్తలు పడిపోయారు. దీంతో దశాబ్దాలుగా క్రమంగా వచ్చిన మార్పు ఏడాదిలో అత్తలను బానిసలుగా మార్చేసింది.

ఆర్థిక స్వాతంత్య్రం..

ఇటీవల కాలంలో మహిళలు ఉన్నత చదువులు చదవి చైతన్యవంతులయ్యారు. అన్ని సమాజిక వర్గాల్లోను సాప్ట్‌వేర్‌ లేదా మరే ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొంది ఆర్థికంగా వెసులుబాటు పొందుతున్నారు. దీంతో అత్త ఇచ్చే సంపాదనపై ఆధారపడలేక పోవడం, ఆమె పెత్తనాన్ని సహించలేక ఎదురు తిరగడం ప్రారంభించారు. ఇది వృద్ధాప్యంలో వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడి కోడలు చూడక, కొడుకు గెంటేయడంతో స్టేషన్ల బాట పడుతున్నారు.

బాధ్యతలు పంచుకోవాలి..

ఇటీవల కాలంలో కోడళ్ల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తోంది. కేవలం అత్తింట్లో హక్కుల సాధనకే చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ భారతీయ సంస్కృతిలో అత్త మామలను చూడడం కూడా కోడళ్ల బాధ్యతే. కానీ దానిని మరుస్తున్నారు. దీనికి సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా తోడవడం సమస్య మరింత పెరగడానికి కారణమవుతోంది.

కేవలం అత్తలను విలన్లుగా చూపించడంతో బాధితులుగా మారుతున్న వారి ఉదంతాలు వెలుగులోకి రావడం లేదు. కానీ సమాజంలో కనబడకుండా ఈ సమస్య చాపకింత నీరులా పెరుగుతోంది. కోడళ్లు కూడా బాధ్యతగా ఉంటేనే భారతీయ సంస్కతికి వారసులమవుతాం.

- గోగుల సృజనారెడ్డి, సైకాలజిస్ట్‌

చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారుసమాజంలో ఉన్న వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి భారత సర్కారు 1983లో భారత శిక్షాస్మృతిలో 498-ఏ సెక్షన్‌ ప్రవేశపెట్టింది. నేడు అదే సెక్షన్‌(498-ఏ) కుటుంబ విలువలకు నష్టం కలుగచేస్తూ..మహిళల రక్షణ కోసం వినియోగించాల్సిన చట్టాన్ని  స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో కుటుంబ విలువలకు నష్టం కలుగుతుంది.

ఈ చట్టం వల్ల రక్షణ అటుంచి కుటుంబ సభ్యులను, అత్తమామలను వేధించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో చట్టం లక్ష్యం నెరవేరడం లేదు. అంతేకాకుండా తల్లిదండ్రులు కష్టపడి చదివించి ప్రయోజకులను చేస్తే వారిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తూ అనాథలుగా మారుస్తున్నారు.

నేటి సమాజంలో ఇటువంటి దుస్థితికి అడ్డుకట్ట వేయడానికి సుప్రీం కోర్టు సీనియర్‌ సీటిజన్‌ ప్రొటెక్షన్‌ చట్టం ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసం ఆర్‌డీఓ నేతృత్వంలో కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారో  వారిపై ఆర్డీఓ  కోర్టులో ఫిర్యాదు చేయాలి. విచారించి 90 రోజుల్లో ఆర్‌డీఓ కోర్డు ద్వారా తల్లిదండ్రులకు జీవన భృతిని తమ పిల్లల నుంచి ఇప్పిస్తుంది.

- కొడిదల శంకర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

వారానికి మూడు, నాలుగు కేసులు వస్తున్నాయి..భార్యభర్తల పంచాయితీలు, అత్తాకోడళ్ల గొడవలు వారానికి మూడు నాలుగు కేసులు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నాయి. దాదాపుగా స్టేషన్‌లోనే కౌన్సెలింగ్‌  ఇచ్చి సర్దుబాటు చేస్తున్నాం. సమస్య తీవ్రంగా ఉంటే వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నాం.

- కూచిపూడి జగదీష్, ఎస్సై 

మరిన్ని వార్తలు